Magazines

పేదల సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధే ధ్యేయం

36 నిమిషాల క్రితం

Mla Kadiyam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 2 నిమిషాల చదవడం

నియోజకవర్గానికి రూ.1,600 కోట్లతో అభివృద్ధి పనులు

మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

నవతెలంగాణ - స్టేషన్ ఘనపూర్ 

పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడంలో తమ ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని అన్నారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 4.50 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని కడియం శ్రీహరి అన్నారు. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఐదు రకాల పింఛన్ల నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.

ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం

 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
నియోజకవర్గానికి ఐదు వేల ఇందిరమ్మ ఇళ్లు

రాష్ట్రంలో రెండు విడతల్లో ఎనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఐదు వేల ఇళ్లు కేటాయించినట్లు కడియం వెల్లడించారు. అర్హతలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కూడా పేదలకు అందించలేదని విమర్శించారు.

రూ.1,600 కోట్లతో అభివృద్ధి పనులు

గత 15 ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకబడిన స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒప్పించి రూ.1,600 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయించానని ఎమ్మెల్యే తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల పరిధిలో రూ.400 కోట్లతో రహదారి పనులకు త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం

నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా అభివృద్ధి పనులు చేపట్టడమే తన లక్ష్యమని కడియం శ్రీహరి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం వ్యక్తిగత రాజకీయాల కంటే ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాంబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, తహసీల్దార్ రాజేష్, జిల్లా, మండల స్థాయి నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్