నవతెలంగాణ - హైదరాబాద్ : పాలక్కాడ్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించిన ర్యాలీపై పోలీసుల చర్యను మాజీ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. ఎస్‌ఐఆర్ అంశంపై జరుగుతున్న ఆందోళనలను లాఠీలతో, క్రిమినల్ పోలీసుల ద్వారా అణచివేసేందుకు యూడీఎఫ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పాలక్కాడ్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ పోలీసు అధికారి విద్యార్థులపై దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై విద్యార్థులు, మీడియా ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ వెంటనే చర్యలు తీసుకోలేదని విమర్శించారు. శాసనసభలో ప్రతిపక్షం ఆందోళన చేసిన తర్వాతే సంబంధిత పోలీసు అధికారిని సస్పెండ్ చేశారని తెలిపారు. విద్యార్థులపై దాడి చేసిన సమయంలో ఆ పోలీసు మత్తులో ఉన్న విషయాన్ని సభలో ప్రభుత్వం వెల్లడించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసుల దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, ఇది హోంశాఖ వైఫల్యమని విజయన్ విమర్శించారు. తిరువనంతపురంలోని హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై దాడి చేసి, బెదిరించిన పోలీసులపైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. పోలీసు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, చట్టాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే వారిని అణచివేసే చర్యలను అంగీకరించబోమని హెచ్చరించారు.
పోలీసు చర్యలపై పినరయి విజయన్ విమర్శలు
13 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)