నవతెలంగాణ-హైదరాబాద్: సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) గురువారం దేశవ్యాప్త ఆందోళన చేపట్టనుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడం, అమెరికాతో వాణిజ్య ఒప్పంద ప్రయత్నాల నుంచి వెనక్కి తగ్గడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం ఈ ఆందోళన ప్రధాన డిమాండ్లు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక రైతు పోరాటానికి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నిరసనకు పిలుపునిచ్చారు. కిసాన్ మోర్చా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి అందజేయనున్నారు.
2021 డిసెంబర్ 9న రైతు ఉద్యమ విరమణ సమయంలో కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినతిపత్రంలో ప్రధానంగా కోరుతున్నట్లు కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, సంయుక్త కార్యదర్శి పి. కృష్ణప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. వ్యవసాయ రుణాల సమగ్ర మాఫీ, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం, ప్రభుత్వ రంగంలో పంట-పశువుల బీమా కార్పొరేషన్ ఏర్పాటు, ప్రధానమంత్రి పేరుతో ఉన్న పంటల బీమా పథకం రద్దు వంటి డిమాండ్లు కూడా ఈ వినతిపత్రంలో ఉన్నాయి.
విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు, విత్తన బిల్లులను ఉపసంహరించుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలి, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బలవంతంగా బిగించడం ఆపాలి, బలవంతపు భూసేకరణ చేయకూడదు, భూసేకరణ సమయంలో న్యాయమైన పరిహారం అందించే ఎల్ఏఆర్ఆర్ (LARR) చట్టం ప్రకారం హక్కులను రక్షించాలి, అటవీ హక్కుల చట్టం కింద హక్కులను నిర్ధారించాలి. వీటితో పాటు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడం, రూ. 42,000 కనీస వేతనం, ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ, రూ. 700 వేతనంతో 200 రోజుల పని దినాలు, రైతులు మరియు వ్యవసాయ కార్మికులకు రూ. 21,000 పెన్షన్, సార్వత్రిక సామాజిక భద్రత వంటి డిమాండ్లను కూడా ఈ ఆందోళనలో లేవనెత్తుతామని నేతలు వెల్లడించారు.
100 కేంద్రాల్లో నిరసనలు
ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా వంద కేంద్రాల్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనలు నిర్వహించనుంది. ఢిల్లీలోని మందిర్ మార్గ్ నుంచి జంతర్ మంతర్ వరకు రైతులు ర్యాలీ తీయనున్నారు. టిక్రీ, బహదూర్గఢ్ సరిహద్దుల్లో కూడా నిరసనలు జరగనున్నాయి. కేరళలోని 14 జిల్లాల్లో ఆందోళనలు చేపట్టనున్నారు.
పంజాబ్లో నాలుగు కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా రైతులు వివిధ కేంద్రాల్లో నిరసనలు నిర్వహిస్తారు. ఈ ఆందోళనకు కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఎస్ఎఫ్ఐ సహా పలు విద్యార్థి సంఘాలు, మహిళా, యువజన సంఘాలు ఇందులో పాల్గొననున్నాయి.





కామెంట్లు (0)