Magazines

2027-28లోనూ పాత సిలబస్సే!

24 నిమిషాల క్రితం

syllabus
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2027-28)లోనూ పాత సిలబస్సే అమలు కానుంది. కొత్త సిలబస్‌ రూపకల్పనకు మే నెలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుమతి ఇచ్చినప్పటికీ, ఆ దిశగా కార్యాచరణ ముందుకు సాగడం లేదు. తాజాగా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగానికి పాత సిలబస్‌నే అందజేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) రూపొందించిన నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌సీఎఫ్‌)-2005 ఆధారంగా 2015లో రాష్ట్రంలో సిలబస్‌ను మార్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు పాఠ్యపుస్తకాల్లో అక్కడక్కడా కొన్ని పాఠ్యాంశాలను మాత్రమే సవరించారు. మినహా పూర్తిస్థాయిలో పాఠ్య ప్రణాళికలో మార్పులు చేపట్టలేదు. దీంతో పదేళ్లు దాటినా విద్యార్థులు పాత సిలబస్‌నే చదువుకోవాల్సి వస్తోంది.

జాతీయ నూతన విద్యా విధానం-2020లో భాగంగా కేంద్ర విద్యాశాఖ కొత్త నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌సీఎఫ్‌)-2023ను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్రాలు తమ అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసుకుని కొత్త సిలబస్‌ను రూపొందించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ రెండేళ్ల క్రితమే స్టేట్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎస్‌సీఎఫ్‌) రూపకల్పన కోసం కమిటీలను నియమించి కసరత్తు చేపట్టింది. అయినప్పటికీ కొత్త పాఠ్య ప్రణాళిక రూపకల్పన కార్యరూపం దాల్చలేదు. తాజాగా వచ్చే విద్యా సంవత్సరానికి కూడా పాత సిలబస్‌నే పంపడంతో కొత్త సిలబస్‌ అమలుపై సందిగ్ధత నెలకొంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్