Monday, September 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ సుంకాలపై బ్రిక్స్‌ ఆందోళన

ట్రంప్‌ సుంకాలపై బ్రిక్స్‌ ఆందోళన

- Advertisement -

న్యూయార్క్‌ : వాణిజ్య భాగస్వామ్య దేశాలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలపై బ్రిక్స్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గాజాలో ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడులను కూడా అవి గర్హించాయి. బ్రిక్స్‌తో పాటు భారత్‌-బ్రెజిల్‌-దక్షిణాఫ్రికాతో కూడిన ఐబీఎస్‌ఏ ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఐబీఎస్‌ఏ తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్‌ ఘర్షణను ప్రస్తావిస్తూ ఉద్రిక్తతలను నివారించాలని, శాంతిని స్థాపించాలని కోరాయి. అయితే బ్రిక్స్‌ తన తుది ప్రకటనలో ఉక్రెయిన్‌ ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా బ్రిక్స్‌ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ప్రసంగిస్తూ ప్రపంచంలో బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన అవసరం ఉన్నదని సభ్య దేశాలకు సూచించారు.

నిర్మాణాత్మక మార్పుకు గొంతుకగా నిలవాలని కోరారు. ఏకపక్షవాదం, ఆర్థిక జాతీయతావాదం కారణంగా ఎదురయ్యే ప్రమాదాలపై హెచ్చరికలు చేశారు. ‘పెరుగుతున్న రక్షణ వాదం, సుంకాల అస్థిరత, సుంకేతర అడ్డంకులు వాణిజ్యానికి అడ్డంకిగా మారుతున్నాయి. కాబట్టి బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను బ్రిక్స్‌ దేశాలు పరిరక్షించాలి’ అని జైశంకర్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు పాతిక శాతం టారిఫ్‌ను విధించడం సహా మొత్తంగా భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచంలో శాంతి పరిరక్షణకు, చర్చలకు, దౌత్యానికి, అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉంటామని బ్రిక్స్‌ సందేశం ఇవ్వాలని జైశంకర్‌ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -