ఆర్థిక వ్యవస్థ మందగింపు
జీడీపీ 0.1 శాతానికి పతనం
జేఎల్‌ఆర్‌పై సైబర్‌దాడి ఎఫెక్ట్
లండన్ : ప్రముఖ పెట్టుబడిదారి దేశం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రస్తుత ఏడాది 2025 సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఆ దేశ జీడీపీ ఏకంగా 0.1 శాతానికి క్షీణించింది. ఇదే విషయాన్ని ఆదేశ ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్‌ఎస్) గురువారం ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇంతక్రితం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో 0.3 శాతం వృద్ధి చోటు చేసుకుంది. గడిచిన క్యూ3లో 0.2 శాతం పెరుగుదల ఉండొచ్చని ఆర్థిక నిపుణులు వేసిన అంచనాల కంటే మరింత తగ్గడం ఆ దేశ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. కాగా.. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 0.7 శాతం వృద్ధి చోటు చేసుకుంది. సెప్టెంబర్‌లో టాటా గ్రూపునకు చెందిన జాగ్వర్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) ప్లాంట్‌పై జరిగిన సైబర్ దాడి జీడీపీ పతనానికి ప్రధాన కారణమని బ్రిటన్ నిపుణులు భావిస్తున్నారు. సైబర్ అటాక్ వల్ల ఐదు వారాల పాటు ఆ కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో కార్ల తయారీ 28.6 శాతం క్షీణించింది.
ఈ సంఘటనతోనే ఒక్క నెలలోనే జీడీపీ 0.17 శాతం తగ్గిందని అంచనా. మరోవైపు అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల ప్రభావం, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు ఈ మందగమనానికి కారణాలుగా ఉన్నాయి. జీడీపీ పతనం కోవిడ్ నాటి కనిష్ట స్థాయి కావడం గమనార్హం. జులైలో జీడీపీ 0.1 శాతంగా, ఆగస్టులో 0 శాతం, సెప్టెంబర్‌లో 0.1 శాతంగా నమోదయ్యింది. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో సేవల రంగం 0.2 శాతం, నిర్మాణ రంగం 0.1 శాతం చొప్పున పెరగ్గా.. ఉత్పత్తి రంగం 0.5 శాతం పడిపోయింది. ”ప్రజల కోసం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది” అని బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి రాచెల్ రీవ్స్ పేర్కొన్నారు. నవంబర్ 26న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పన్ను పెంపు సంకేతాలు వస్తోన్న నేపథ్యంలో ఈ గణాంకాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. జీడీపీ పడిపోతున్న నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను 3.75 శాతానికి తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.



