Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాలిసెట్-2026పై విస్తృత అవగాహన

పాలిసెట్-2026పై విస్తృత అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్-2026)పై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులకు పరీక్ష విధానం, ప్రశ్నాపత్రం తీరు, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవశాస్త్రం వంటి విషయాలను ఎలా సులభంగా అభ్యసించాలో నిపుణులు వివరిస్తున్నారు.

విద్యార్థులు మంచి ర్యాంక్ సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, సమయ నిర్వహణ, పరీక్షలో సమర్థవంతంగా సమాధానాలు రాయడం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. అంతేకాకుండా పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తూ, ఉచితంగా పాలిటెక్నిక్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పించడం విశేషం.

ఈ కార్యక్రమాల ద్వారా సాంకేతిక విద్య ప్రాముఖ్యత, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి మార్గాలు వంటి అంశాలను కూడా వివరంగా తెలియజేశారు. పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేస్తే భవిష్యత్తులో మంచి కెరీర్ అవకాశాలు ఉంటాయని విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజ్ కుమార్ మాట్లాడుతూ, పాలిసెట్-2026 దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 20 కాగా, ప్రవేశ పరీక్ష మే 13న నిర్వహించబడుతుందని తెలిపారు. ఇంకా దరఖాస్తు చేయని విద్యార్థులు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే శాఖాధిపతులు డా. శివనందిని, రవి కుమార్, డా. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎండను సైతం లెక్క చేయకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న సిబ్బందిని అభినందించారు.

గత మూడు నెలలుగా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు విలువైన మార్గదర్శకత్వం అందిస్తున్న సిబ్బందికి ప్రిన్సిపాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -