మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురిచేసినా మొక్కవోని దీక్షతో వీరోచితంగా పోరాడిన బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఆయన బుధవారం ఒక ప్రకటనలో హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలు, దౌర్జన్యాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు పురపాలక సమరంలో గులాబీ సైనికులు కనబరిచిన పోరాట స్ఫూర్తి పార్టీకి కొండంత బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని తెలిపారు. గత రెండేండ్ల పాలనలో ఘోరమైన వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో దౌర్జన్యకాండకు దిగారని విమర్శించారు.
పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే సీఎం అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అక్రమంగా లూటీ చేసిన రూ.వేల కోట్ల ప్రజాధనంతో ప్రజాతీర్పునే మార్చాలని చూస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపులకు, దాడులకు రేవంత్‌రెడ్డి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను, పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం ముఖ్యమంత్రిని ప్రతినిత్యం వెంటాడుతుందని పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
వీరోచితంగా పోరాడిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



