ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీసీల పట్ల బీఆర్‌ఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని, ఆ పార్టీ చూపుతున్నది కపట ప్రేమ అని ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీసీల సంక్షేమంపై ఆ పార్టీ నాయకుల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మక్కన్ సింగ్ ఠాకూర్, నాగరాజుతో కలిసి గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బీసీ కుల గణన విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తీరును ఆది శ్రీనివాస్ తప్పుబట్టారు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు కులగణనకు ముందుకురాని వీరు, ఇప్పుడు బీసీల పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశౄరు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిందని, కేంద్రం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. బీసీల హక్కుల విషయంలో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. బీసీల పట్ల అంతటి ప్రేమ ఉన్నప్పుడు, వారి పార్టీలో బీసీ నాయకులకు కీలక పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
సిద్దిపేటలో హరీశ్ రావు ఓటమి ఖాయం
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చిట్‌చాట్ పేరుతో చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్‌లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, వేముల వీరేశం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. హరీశ్‌రావు చిట్‌చాట్ పేరుతో బడాయి కబుర్లు, సొల్లు కబుర్లు చెబుతున్నారని. సిద్దిపేటకు రేవంత్ రెడ్డి వెళ్లాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బి-ఫాం అభ్యర్థి మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయమని అన్నారు. తలకిందులు తపస్సు చేసినా బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాదన్నారు. కేసీఆర్ ఇక ఎప్పటికీ ముఖ్యమంత్రి కారని, బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకున్న రోజే ప్రజలు ఆ పార్టీని ఫాంహౌస్‌కు పరిమితం చేశారని అన్నారు. ప్రజాదరణ పొందుతున్న ముఖ్యమంత్రి ఎదుగుదలను చూసి ఓర్వలేక.. అక్కసుతో హరీశ్‌రావు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారని, ఇకనైనా ఆ పద్ధతి మానుకోవాలని సూచించారు.
కల్తీ కల్లు వల్ల ప్రాణం కోల్పోతున్న ప్రజలు : బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
ఉత్తర తెలంగాణలో కల్తీ కల్లు(ఆల్ఫ్రాజోలం) వల్ల అమాయక ప్రజలు ప్రాణం కోల్పోతున్నారని, కల్తీ లేని ఉత్తర తెలంగాణను నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కోరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని పేరును ప్రతి పథకానికీ పెట్టి అవమానించకండని, ఇందిరాగాంధీ పేరు కాకుండా తెలంగాణ అమరవీరుల పేర్లు, ఇతర మాజీ ప్రధానులు, మాజీ ముఖ్యమంత్రుల పేర్లు మీకు కనిపించడం లేదా? అని నిలదీశారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో మాజీ ప్రధానిపై అభ్యంతరకరమైన వీడియోలు వస్తున్నాయని, వాటిని ఖండించిన ఏకైక ఎమ్మెల్యేను తానేనని అన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఇప్ప సారాకు బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్ తరహాలో ‘పింక్ లేబుల్’ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు.
40 ఏండ్లుగా పార్టీకి సేవ చేసిన నేతలను కాంగ్రెస్ వెళ్లగొడుతోందని, కరీంనగర్ మంత్రులకు జీవన్‌రెడ్డి ద్వారా షాక్ తగిలిందని అన్నారు. కౌలుదారులు వచ్చి కాంగ్రెస్‌ను నాశనం చేస్తున్నారని జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలన్నారు. కల్తీ కల్లు వ్యాపారాలతో సంబంధం ఉన్నవారు పార్టీని డైవర్ట్ చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. చనిపోయిన 120 మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు? వారు కమీషన్లు ఇవ్వలేరనే కనికరం లేదా? సచివాలయం చుట్టూ తిరుగుతున్న వారి బాధ ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణ కోటాలో మంత్రి పదవులు దక్కించుకున్న శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లా తరపున దావోస్ వెళ్లిన మంత్రి శ్రీధర్‌బాబు, అక్కడి నుంచి రాష్ట్రానికి ఏమి తెచ్చారని ప్రశ్నించారు.
బీసీల పట్ల బీఆర్‌ఎస్, బీజేపీలది కపట ప్రేమ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



