Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ హౌరాహౌరీ ప్రచారం

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ హౌరాహౌరీ ప్రచారం

- Advertisement -

– హీటెక్కిస్తున్న మాటలు
– మాగంటి సునీత నామినేషన్‌ దాఖలు
– అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో

జూబ్లీహిల్స్‌ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారం హౌరాహౌరీగా సాగుతోంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. దాంతో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. జూబ్లీహిల్స్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌ నుంచి మాగంటి సునీత నామినేషన్‌ దాఖలు చేశారు.

బీఆర్‌ఎస్‌ ప్రచార పర్వం..
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి మాగంటి సునీతను బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. సానుభూతి పవనాలతోపాటు నియోజకవర్గంలో గోపీనాథ్‌ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ మంగళవారం స్వయంగా మాగంటి సునీతకు బీ-ఫామ్‌, ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40లక్షల చెక్కును అందజేసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాగా బుధవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి మాగంటి సునీత తన నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రచారానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ దూకుడు
మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌ను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్‌ ప్రణాళికలను వివరిస్తూ.. కాంగ్రెస్‌ నాయకులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గేలుపే లక్ష్యంగా నేతలు తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిచి హైదరాబాద్‌పై పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ కృషిచేస్తోంది. మాగంటి సునీతపై మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. బీజేపీ ఎట్టకేలకు లంకల దీపక్‌రెడ్డిని అభ్యర్థిగా బుధవారం ప్రకటించింది. 2023 ఎన్నికల్లోనూ దీపక్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. దీపక్‌ రెడ్డితోపాటు జె. కీర్తి రెడ్డి, పద్మ, మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ పోటీపడ్డారు. చివరికి ఆ పార్టీ అధిష్టానం మాత్రం దీపక్‌ రెడ్డి వైపే మొగ్గుచూపింది. జాతీయ నేతలు ప్రచారానికి రానున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -