Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగవర్నర్‌ ప్రసంగానికి బీఆర్‌ఎస్‌ అడ్డగింత

గవర్నర్‌ ప్రసంగానికి బీఆర్‌ఎస్‌ అడ్డగింత

- Advertisement -

తప్పులు చదువుతున్నారంటూ పెద్దఎత్తున కేకలు
ప్రారంభం నుంచి ముగింపుదాకా అరుపులే
సభలో నిలబడే ఉన్న హరీశ్‌రావు, కేటీఆర్‌


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ప్రసంగించారు. ఆయన ప్రసంగం మొదలైనప్పటి నుంచి ముగింపు దాకా బీఆర్‌ఎస్‌ సభ్యులు అరుపులు, కేకలు వేశారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. సభ పూర్తిగా వారి అరుపులు, కేకలతో దద్దరిల్లింది. ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావించినపుడు తప్పులు చదువుతున్నారంటూ అన్నారు. అయితే గవర్నర్‌ ప్రసంగం ప్రారంభం నుంచి ముగింపుదాకా హరీశ్‌రావు, కేటీఆర్‌ సహా ఇతర బీఆర్‌ఎస్‌ సభ్యులు నిలబడే ఉండడం గమనార్హం. సమ్మిళిత వృద్ధి, వినూత్నతకు ప్రపంచ దిక్సూచిగా తెలంగాణ నిలుస్తుంది అనేదే ఈ విజన్‌ అని గవర్నర్‌ చదివారు.

దీనికి ఈ ప్రభుత్వానికి విజన్‌ లేదంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులు అన్నారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2047 సదస్సులో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గవర్నర్‌ చెప్పారు. దీనికి అదంతా బోగస్‌ అని హరీశ్‌రావు సహా ఇతర సభ్యులు వ్యాఖ్యానించారు. 23వ బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు ద్వారా రూ.1,700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని గవర్నర్‌ ప్రసంగించారు. అది అబద్ధమని బీఆర్‌ఎస్‌ సభ్యులు అన్నారు. రైతు భరోసా ఇంద తొమ్మిది రోజుల్లోనే రూ.8,744 కోట్లు విడుదల చేశామని గవర్నర్‌ చెప్పారు. ఇది పూర్తిగా అబద్ధమనీ, అది కేవలం కాగితాల్లోనే విడుదల చేశారంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులు ఎద్దేవా చేశారు. సన్నరకం వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను విడుదల చేశామంటూ గవర్నర్‌ ప్రసంగించగానే అది ఇంకా ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ సభ్యులు అన్నారు.

రూ.20,616 కోట్లతో 25 లక్షల మంది రైతులపై ఉన్న రుణభారాన్ని తగ్గించేలా రూ.రెండు లక్షల పంట రుణమాఫీని విజయవంతంగా చేశామని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. రుణమాఫీ ఇంకా పూర్తిగా చేయలేదనీ, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా పూర్తి వివరాలు తెలియవని బీఆర్‌ఎస్‌ సభ్యులు అన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వాటాను పంచుకోవడంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడ్డంలో ప్రభుత్వం అన్ని చర్యలనూ చేపడుతున్నదని గవర్నర్‌ చెప్పారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ సభ్యులు వివరించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి 4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గవర్నర్‌ వివరించారు.

హైడ్రా, ఇతర పేర్లతో ఉన్న ఇండ్లను ప్రభుత్వం కూలగొడుతున్నదని బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆరోపించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా రూ.9,222 కోట్లు మహిళలు ఆదా చేసుకున్నారని గవర్నర్‌ చెప్పారు. ఆర్టీసీ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని హరీశ్‌రావు కోరారు. గృహజ్యోతి పథకం కింద పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని గవర్నర్‌ వివరించారు. ఇది బోగస్‌ అని బీఆర్‌ఎస్‌ సభ్యులు వ్యాఖ్యానించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని గవర్నర్‌ వ్యాఖ్యానించగానే మహిళలకు నెలకు రూ.2,500 ఎప్పుడిస్తారని బీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రశ్నించారు.

ఇందిరా మహిళా శక్తి పాలసీ బోగస్‌, తెలంగాణ టూరిజం పాలసీ 2025-30 అబద్ధం, మంత్రివర్గం ఆమోదించిన స్పోర్ట్స్‌ పాలసీ బోగస్‌, తెలంగాణ రైజింగ్‌-2047 పాలసీ అబద్ధం, హిల్ట్‌ పాలసీ స్కాం, క్లీన్‌ అండ్‌ ఎనర్జీ పాలసీ అబద్ధం, ఎంఎస్‌ఎంఈ పాలసీ బోగస్‌, లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ అబద్ధం అని బీఆర్‌ఎస్‌ సభ్యులు పెద్దఎత్తున అరిచారు. ప్రజావాణి గురించి గవర్నర్‌ ప్రసంగిస్తుండగానే సీఎం రేవంత్‌రెడ్డి కనిపించడం లేదని బీఆర్‌ఎస్‌ సభ్యులు అన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేసిందని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆరోపించారు. రికార్డు సమయంలోనే 67,763 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందని గవర్నర్‌ వివరించారు. ఇది బోగస్‌ అని బీఆర్‌ఎస్‌ సభ్యులన్నారు. గవర్నర్‌ ప్రసంగం ముగింపు సమయంలో ఆరు గ్యారంటీల గురించి ఒక్క మాట చెప్పాలంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -