Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్‌ఎస్‌ బీసీ వ్యతిరేక పార్టీ

బీఆర్‌ఎస్‌ బీసీ వ్యతిరేక పార్టీ

- Advertisement -

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్‌
ప్రశ్నించే వారిని గెలిపించండి : కల్వకుంట్ల కవిత


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీసీల రిజర్వేషన్లన పెంపును అడ్డుకున్న బుట్టంగారి మాధవరెడ్డికి మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ బీసీ వ్యతిరేక నైజం బయట పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా మాధవరెడ్డి కోర్టులో కేసు వేస్తే ఆయన వెనుక మాజీమంత్రి హరీశ్‌రావు మాత్రమే ఉన్నారని భావించామనీ, పార్టీ టికెట్‌ ఇవ్వడంతో బీఆర్‌ఎస్‌ ఉందని స్పష్టమైందని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనీ, బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం తరపున మాత్రమే గతంలో సమావేశం ఏర్పాటు చేశారే తప్ప పార్టీ తరఫున కాదని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రంలో 56శాతం మంది బీసీల వ్యతిరేకి అయిన మాధవరెడ్డికి టికెట్‌ ఎందుకిచ్చారో బీఆర్‌ఎస్‌ చెప్పాలని ఆమె ప్రశ్నించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నిజామాబాద్‌ ఇన్‌చార్జిగా, అదే విధంగా అసెంబ్లీ స్పీకర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా ప్రకటించిన ప్రకాశ్‌ గౌడ్‌, తెల్లం వెంకట్‌ రావులను మున్సిపల్‌ ఇన్‌చార్జిలుగా నియమించుకుని కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆమె విమర్శించారు.

రాజ్యాంగంపై నమ్మకముంటే అరికెపూడి గాంధీపై వేటు వేయాలని ఆమె కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేశారు. లేదంటే స్పీకర్‌ వేటు వేయాలని కోరారు. ఏడాదికి బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్‌ హామీతో గద్దనెక్కిన కాంగ్రెస్‌ రెండేండ్లలో రూ.7 వేల కోట్లు కూడా ఇవ్వలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌ సహా వారికిచ్చిన హామీలను రాబోయే బడ్జెట్‌లో నెరవేర్చాలని ఆమె కోరారు. ఆ రెండు పార్టీల ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉన్నాయనీ, ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల్లో తమ లాంటి ప్రశ్నించే గొంతులను గెలిపించాలని ప్రజలను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో జాగృతి తరపున సింహం గుర్తుపై పోటీ చేస్తున్న తమ అభ్యర్థులతో పాటు సీపీఐ(ఎం), న్యూడెమోక్రసీ, స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ
హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ నెల 12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్టు కవిత వెల్లడించారు. ఉద్యమకారులను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మోసం చేశాయనీ, బీజేపీ గురించి మాట్లాడుకోవడం వృధా అని కవిత కొట్టిపారేశారు.

ఉద్యమంలో కేసీఆర్‌కు ఒక పుస్తకం
ఉద్యమంలో కేసీఆర్‌కు ఒక పుస్తకమే ఉంటుందని కవిత కామెంట్‌ చేశారు. రాజకీయంగా కేసీఆర్‌ విధానాలను విబేధిస్తానని ఆమె స్పష్టం చేశారు. అయితే రాజకీయాలు మర్యాదపూర్వకంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆ పరిధిని దాటారని విమర్శించారు. ఒక జాతిని విమర్శించడం హర్షణీయం కాదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో చిన్న చేపను పట్టుకుని పెద్ద చేపలను వదిలేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -