Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రాన్ని నాశనం చేసిందే బీఆర్‌ఎస్‌

రాష్ట్రాన్ని నాశనం చేసిందే బీఆర్‌ఎస్‌

- Advertisement -

సుద్ద పూసలా నీతులు మాట్లాడుతున్నారు
నాడు 36 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదు? : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నవతెలంగాణ-వేలేరు

తెలంగాణా రాష్ట్రాన్ని నాశనం చేసింది బీఆర్‌ఎస్సేనని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు సుద్ద పూసలా నీతులు మాట్లాడుతున్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థాయిని మరిచి సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని తెలిపారు. 21నెలల్లోనే రూ.1026 కోట్ల నిధులు తీసుకొచ్చానంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో మాత్రమే సాధ్యమైందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించు కోకుండా ఈ రోజు పాదయాత్రలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఏ కాలువ ఎటు పోతుందో కూడా తెలియని వ్యక్తి కాలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రోడ్డు వెంట ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరెంత రెచ్చగొట్టినా రెచ్చిపోనని, వాళ్ల స్థాయికి నేను దిగ జారనని అన్నారు. తనను రాజీనామా చేయాలనే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని, ఆనాడు ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన 36మంది ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.అయినా తానెందుకు రాజీనామా చేయాలి? రాజీనామా చేయడం వల్ల దేనికి ఉపయోగమని ప్రశ్నించారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, వారికి సన్న బియ్యంతో కడుపు నిండుతోందని చెప్పారు. నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గండి రామారం లిఫ్ట్‌ 1 పనులను 31డిసెంబర్‌ 2025 నాటికీ పూర్తి చేసి వేలేరు, చిల్పూర్‌ మండలాలకు రెండో పంటకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కొమీ ఎంపీడివో లక్ష్మి ప్రసన్న, ఏవో, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -