– నామినేషన్ దాఖలు చేసిన ఛైర్పర్సన్ అభ్యర్ధిని నాగశేషపద్మ
– మేము చేసిన అభివృద్దే మా అభ్యర్థులను గెలిపిస్తుంది – మాజీ ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో ఎమ్మెల్యేలుగా తమ హయాంలో చేసిన అభివృద్ధే బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపిస్తుంది అని మాజీ ఎమ్మెల్యే లు తాటి వెంకటేశ్వర్లు,మెచ్చా నాగేశ్వరరావు లు ధీమా వ్యక్తం చేసారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ 8 వ వార్డు కౌన్సిలర్,ఛైర్పర్సన్ కాసాని నాగశేషపద్మ పద్మ తో పాటు మరో 8 మంది కౌన్సిలర్ అభ్యర్థులు గురువారం భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేసారు.
వీరి నామినేషన్ ను ఆర్ఓ లు కొండపాక లత,ఎం.హరిప్రసాద్ లకు అభ్యర్ధిని నాగశేషపద్మ తో పాటు ప్రతి పాదకుడు పాలవలస జీవన్ రావు,మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు లు అందజేసారు. అభ్యర్ధిని నాగశేషపద్మ గృహం నుండి నామినేషన్ స్వీకరణ కేంద్రం (ఎంపీడీఓ ) వరకు కార్లు,ద్విచక్రవాహనాలు,నడిచి కొందరు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ల అనంతరం మీడియా మిత్రులతో మెచ్చా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి 22 వార్డులలో అభ్యర్థులను గెలిపిస్తుందని, 22 వార్డులలో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏంటో అశ్వారావుపేట లోని రింగ్ రోడ్డు చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని,ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని,ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చెయ్యలేదని,ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని,బీఆర్ఎస్ పార్టీ వైపే అందరి చూపు ఉందని హర్షం వ్యక్తం చేసారు. ఈ ర్యాలీ లో మాజీ ఎమ్మెల్యే లు తాటి వెంకటేశ్వర్లు,మెచ్చా నాగేశ్వరరావు,మాజీ జెడ్పీటీసీ సభ్యులు జేకేవీ రమణారావు,పద్మజ,కోటగిరి సీతారామస్వామి, మండల సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



