8 పట్టణాలకు సీనియర్ నేతలకు ఇన్‌చార్జీ బాధ్యతలు
కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకోవడమే లక్ష్యం : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టిసారించింది. మంగళవారం జరిగే మున్సిపల్ చైర్మెన్ల ఎన్నికలపై అప్రమత్తమైంది. ఎనిమిది పట్టణాలకు ఆ పార్టీ సీనియర్ నేతలకు ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించింది. కాంగ్రెస్ అరాచకాలపై పార్టీ స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మాట్లాడారు. స్థానికంగా కాంగ్రెస్ చేస్తున్న అక్రమ కిడ్నాప్‌లు, బెదిరింపులు, పోలీసుల దుర్వినియోగం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకుని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించుకోవడమే లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ అరాచకాలపైన బీఆర్‌ఎస్ అండగా ఉందని భరోసానిచ్చారు. మంగళవారం ఎన్నికలు జరగనున్న ఎనిమిది మున్సిపాల్టీల్లో బీఆర్‌ఎస్ స్పష్టంగా చైర్మెన్ పీఠాలను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఈ ఎనిమిది మున్సిపాల్టీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు చేసినా తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు.
మున్సిపాల్టీల వారీగా బీఆర్‌ఎస్ ఇన్‌చార్జీలు
తొర్రూర్ : ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సత్యవతిరాథోడ్,మాజీమంత్రి పెద్ది సుదర్శన్‌రెడ్డి
జనగామ : శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
క్యాతనపల్లి : ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఖానాపూర్ : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇంద్రేశం : ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి
కాగజ్ నగర్ : మాజీమంత్రి జోగు రామన్న
జహీరాబాద్ : ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి
ఇబ్రహీంపట్నం : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు



