Monday, July 21, 2025
E-PAPER
Homeదర్వాజబువ్వకుండ

బువ్వకుండ

- Advertisement -

ఈ ఆయితారం బోనాలురో అని సాటింపు చేయగానే
ఆ రోజంతా మనసు యాపకొమ్మ పూతైతది
పెండ్లైన కల్పనమ్మను తోల్కరావాలంటూ
ఇసుపెద్దప్ప గుండె పండగ డప్పైతది!
గుడికి సున్నమేసి సాన్పిజల్లి తంగెడుపూల పందిరేసి
కిందికేరి మీదికేరి పోలెల నడుమ పూర్ణమైతరు!
పొద్దిమీకంగా మా ఊరు
పట్టుచీర కట్టుకున్న బోనం కుండైతది
పాలు బెల్లంతో ఉడుకుడుకు బువ్వతో
కొత్త కుండ బోనాలబట్టలేసుకుని
ఇంటికి పసుపు కుంకుమల పాటైతది!
ఇంటి గడప దాటే బోనం
రాత్రంతా మా ఊరి గుండెచప్పుడై
ఊరంతా జరుపుకునే డప్పుల జాతరైతది!
చెప్పులు లేని కాళ్ళకు
తడిసిన తొవ్వ మట్టిగంధం పూసి
పొలిమేర దాకా పట్టగొలుసులపువ్వులై నడుస్తుంటాయి!
వానచినుకుల తోరణాల నడుమ సన్నని మంటపై
డప్పులు పెయ్యికాపుకుని
బోనాల ముందు నడుస్తూ ఆటలాడుతుంటాయి!
అమెరికా ఫొటోగ్రఫీకి,
ఇంగ్లాండ్‌ వార్తాపత్రికకు
అర్థంకాని మా బోనాల పండగ
నెత్తికి రుమాలుకట్టి రాయిలో దేవతను చూసే
ఇసుపెద్దప్ప ముట్టించే ఆషాడదీపం ఎంతో గొప్పది!
ఈ త్యాప బోనాల పండగకు
ఎవరు సాటింపు చేస్తారని
మట్టిదుప్పటి కప్పుకున్న
ఇసుపెద్దప్పను తల్సుకుంటూ
పోశమ్మగుడి కాడ ఎల్లిపెద్దమ్మ
తెగిపోయిన కత్వైయింది!
– చిగురాల్‌ పల్లి ప్రసాద్‌, 9642109537

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -