19 మంది మృతి.. 28 మందికి గాయాలు
అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్టు అనుమానం
ఖాట్మాండు : నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ధాడింగ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 28 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… పొఖారా నుంచి ఖాట్మాండుకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ఆదివారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ధాడింగ్ జిల్లాలో గజూరీ వద్ద అదుపుతప్పి త్రిశూలీ నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 47మందికిపైగా ప్రయాణికులున్నారు.
వారిలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో న్యూజిలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో జపాన్, నెదర్లాండ్స్ మహిళలు ఉన్నట్టు చెప్పారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. అతివేగం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అర్థరాత్రి వేళ ప్రమాదం.. సహాయక చర్యలకు ఆటంకం
బస్సు ప్రమాదంలో అర్ధరాత్రి సమయంలో జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగిందని సాయుధ పోలీసు ప్రతినిధి బిష్ణు ప్రసాద్ భట్టా తెలిపారు. ఉదయం 6:30 గంటలకు సహాయక చర్యలు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సహాయక చర్యల్లో నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు దళం, నేపాల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నాయని తెలిపారు.
నేపాల్‌లో పెరిగిన రోడ్డు ప్రమాదాలు
ఇటీవల కాలంలో నేపాల్‌లో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని ట్రాఫిక్ పోలీస్ కార్యాలయం తెలిపింది. అలాగే రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య కూడా పెరిగిందని పేర్కొంది. ఒక దశాబ్దం క్రితం, 4,999 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని వెల్లడించింది.2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 7,669 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 190 మంది మరణించినట్టు తెలిపింది. వీటిలో 278 తీవ్రమైన ప్రమాదాలు అని పేర్కొంది.
నేపాల్‌లో బస్సు ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



