అక్కడికక్కడే ఇద్దరు మృతి
పలువురికి గాయాలు, మరో ఇద్దరు సీరియస్
నవతెలంగాణ-జనగామ
జాతీయ రహదారిపై మరో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం…. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇసుక లారీ ఆగివుంది. ఈ క్రమంలో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఆర్టీసీ రాజధాని ఎక్స్‌ప్రెస్ బస్ ఆగి ఉన్న ఇసుక లారీని అతివేగంగా ఢీకొట్టింది.
దీంతో బస్సులో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు.ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అందులో విషమంగా ఉన్న ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతులు దుండిగల్‌కు చెందిన పూలమాటి ఓం ప్రకాష్(75), హనుమకొండకు చెందిన నవదీప్ సింగ్(52)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రి ప్రాంగణం మతుల కుటుంబ సభ్యుల రోదనతో కన్నీటిపర్యంతంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జనగామ పోలీసులు తెలిపారు.



