అవి 1970ల నాటి రోజులు! రోజూ కలకత్తా నగరంలో ట్రాముల్లో ప్రయాణించేవారికి, మరీ ముఖ్యంగా కిటికీ పక్క సీటుపై కూర్చున్న ప్రయాణికులకు చౌరంఘీ లేన్ రోడ్డు రాగానే తరచూ తప్పనిసరిగా ఓ ఘటన కనిపిస్తుంది. చూడటానికి వద్ధుడుగా కనిపించినా బెంగాలీ సాంప్రదాయంలో ధరించిన ధోవతి, కుర్తా, ముఖంపై గుబురుగడ్డం, తలపై నిండా పెరిగిన జులపాలతో, నిండా 80 ఏండ్లు దాటిన ఆ వద్ధుడు ట్రామ్ ఫుట్బోర్డు మీద ప్రయాణిస్తుంటాడు. చౌరంఘీ ప్రాంతంలోకి రాగానే ఆగకుండానే వేగంగా వెళుతున్న ట్రామ్‌లోంచి చెంగున దూకి చకచకా యువకునివలే నడుస్తూ వెళుతుంటాడా వద్ధుడు. అతన్ని ఆశ్చర్యంగా చూడటం ప్రయాణికులవంతవుతుంది. అప్పుడు తెలిసినవాళ్ళంతా ఎనభై ఏండ్లు నిండిన ఆ వద్ధుడు అనుమానం లేదు ‘అదిగో! చూడండి డి.జి. అతనే” అంటారు. బెంగాలీలు ప్రేమగా పిలుచుకునే ఆ డి.జి.నే ‘ధీరేన్ గంగూలీ’.
నిండా జన సమర్థంతో కూడిన ట్రాముల్లో ప్రయాణించడం, సభలూ, సమావేశాలలో ప్రసంగించడం తన 80వ ఏటా కూడా యువకుడిలా పనిచేసిన ఆయన నిత్య యవ్వనుడు. యువకునిగా ఏ శక్తితోనైతే పని చేశాడో వద్ధాప్యంలో కూడా అంతే విధంగా తన కార్యశీలతను ప్రదర్శించారాయన. బెంగాల్లో ఆయననంతా బెంగాలీ సినిమా పితామహుడుగా అత్యంత గౌరవంగా పిలుచుకుంటారు. కానీ అప్పటికి వారికి తెలియదు ఆయన తెలంగాణ సినిమాకు కూడా పితామహుడని, ఇంకా చెప్పాలంటే ఆయనను ”గ్రాండ్ ఓల్డ్ మేన్ ఆఫ్ ఇండియన్ సినిమా”గా కీర్తిస్తారు.ఆయన అసలు పేరు ”ధీరేంద్రనాథ్ గంగోపాధ్యాయ”. అందరికీ తెలిసిన పేరు ధీరేన్ గంగూలి.
భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ మ్యాజిక్ లాంతర్లో శ్రీకారం చుట్టుకుని 1896లో లూమియర్ బ్రదర్స్ విదేశీ చిత్రాల పరిచయంతో భారతదేశానికి వచ్చిన సినిమా కళ క్రమంగా దేశీయమైన మూకీలతో ప్రాణం పోసుకుని టాకీలతో దేశవ్యాప్తమై జన సామాన్యానికి చేరువైంది. దాదా ఫాల్కే తొలి భారతీయ మూకీ ”రాజా హరిశ్చంద్ర” (1913) తీశాక బొంబాయి, కలకత్తా, నాసిక్, షోలాపూర్, మదరాసులతో బాటు హైదరాబాదులోకూడా మూకీల నిర్మాణం జరిగింది. హైదరాబాదు మూకిల సంగతులన్నీ తెలుగు సినిమా చరిత్రలో ఒక భాగంగా పొడిగా రాసుకోవడం, చదువుకోవడం జరిగింది. ఐతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాదులో జరిగిన మూకీల నిర్మాణాన్ని తెలంగాణ సినిమా చరిత్రకు బీజవాపన చెప్పుకోవాలి.
పైన చెప్పిన విధంగా తెలంగాణ సినిమా రంగానికి హైదరాబాదులో అంకురార్పణ జరిగితే దానికి ఆద్యుడు బెంగాలీ అయిన ధీరేన్ గంగూలీ. ఇంతకి ఈ రీరేన్ గంగూలీ ఎవరో, ఎక్కడి వాడో తెలుసుకుంటే హైదరాబాదులో తొలినాళ్ల మూకీల సంగతులు తెలుస్తాయి. ఈ ధీరేన్ గంగూలీ బెంగాలీ చిత్రసీమకు ఆద్యులైన హీరాలాల్ సేన్, జె.ఎఫ్. మదన్ ల పరంపరలో మూకీల కాలంలో పని చేసిన వారిలో ఒకరుగా చరిత్రకెక్కారు. ధీరేన్ గంగూలీ పూర్తి పేరు ధీరేంద్రనాథ్ గంగోపాధ్యాయ. నేటి బంగ్లాదేశ్ లోని బారిసాల్ లో సాంప్రదాయ ఉన్నత కుటుంబంలో 1893 మార్చి 26న జన్మించిన ధీరేన్ బాల్యంలో సహజంగానే రంగస్థల నాటకం, లలితకళల పట్ల ఆకర్షితులయ్యారు. ఫలితంగా రవీంద్రనాథునితో పరిచయం కలగడానికి ఎంతోకాలం పట్టలేదు. కలకత్తాలోని శాంతినికేతన్ విద్యార్థిగా చేరాడు. రవీంద్రుని శిష్యరికంలో ధీరేన్ సంగీతం, నాటకం, కవిత్వం, దత్యం, చిత్రలేఖనం వంటి కళలపై మంచి పట్టు సాధించారు. ఆయనకు అతి సన్నిహితునిగా మెలిగారు.
ఠాగూర్ రాసిన ‘వాల్మీక్’, ‘రాజ్ అండ్ ఢాక్ ఘర్’ వంటి నాటకాల్లో నటించడమే గాక వాటిని ప్రదర్శించారు కూడా.. శాంతినికేతన్లో చదువు పూర్తయ్యాక 1910లో ధీరేన్ స్కాటిష్ చర్చి కాలేజీలో చేరి ఆరు నెల్ల తర్వాత జూబిలీ ఆర్ట్స్ అకాడమి, గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చదివి 1912లో డిస్టింక్షన్ లో పాసయ్యాడు. చదువు పూర్తవగానే చిత్రకారుడిగా నాటక ప్రయోక్తగా కళారంగంలోకి ప్రవేశించిన ధీరేన్ పేయింటింగ్స్. ప్రదర్శనలు నిర్వహించారు. శాంతినికేతన్ ద్వారా కలకత్తా పోలీసులకు మారు వేషలు వేసుకునే పద్ధతులు నేర్పే ఉద్యోగం వొకటి కూడా చేశారు. ఇవన్నీ చేస్తూనే ఫొటోగ్రఫీలో ఆసక్తిని పెంచుకుని ఆ రంగంలో ప్రయోగాలు చేశాడు. తొలినాటి సినీ రంగంలో ‘డి.జి’ అన్న పేర ప్రసిద్ధి పొందిన ఆయన కలకత్తాలో డమ డమ్ ప్రాంతాలలో ఒక చక్కని తోట మధ్య ఉన్న చిన్న ఇంటిని తన స్టూడియోగా మలచుకొన్నాడు.మరోవైపు దీరేన్ తానే వివిధ వేషధారణలతో కూడిన ఫొటోలు దిగి ‘భనవేర్ అభివ్యక్’ పేర సంకలనం చేశాడు .
‘భావవ్యక్తీకరణకు వివిధ సందర్భాలలో ఎన్ని రూపాలుగా ఉంటుందో తెలుపడమే ఈ ఫొటో సంకలనం ఉద్దేశ్యం, సమకాలీన సమాజంపై వ్యంగ్యంగా ఫోటోలతో వ్యాఖ్యానించాడు.ఒకే ఫొటోలో ఇద్దరు, ముగ్గురు అన్నీంట ధీరేన్ వివిధ రూపాల్లో కనిపించడం ఈ సంకలనం మరో ప్రత్యేకత, ఫొటోగ్రఫీలో ధీరేన్ ప్రతిభను తెలుసుకున్న నిజాం ప్రభువు. వెంటనే తన నిజాం ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగం ఇస్తూ 1915లో ఉత్తర్వులు జారీ చేశారు. 1916లో ఆయన హైదరాబాద్ వచ్చి నిజాం కళాశాల ప్రిన్సిపాల్ గా చేరాడు. అతికొద్ది కాలంలోనే ఆయన ఈ కళాశాల ప్రిన్సిపాల్ గా ఎదిగారు. హైదరాబాద్ వచ్చాక ”ఆమార్ దేశ్ (నా దేశం) అనే మరో ఫొటో సంకలనాన్ని వెలువరించాడు. దీని ప్రతినొక దానిని అప్పుడప్పుడే మూకీల నిర్మాణం ప్రారంభించిన జె.ఎఫ్.మదన్ (కలకత్తా)కి పంపగా ధీరేన్ ప్రతిభను చూసిన మదన్ ”మనం సినిమాల గురించిన కొంత పని కలిసి చేయాల్సి ఉంది. అందులో నీ ప్రతిభ ఉపయోగపడుతుందని, వెంటనే కలకత్తా రమ్మని ఉత్తరం రాశాడు. అప్పటికి ఆయన నెల జీతం 1300 రూపాయలు ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తం అంత పెద్ద జీతాన్ని వదిలిపెట్టి సినిమా రంగంలోకి వెళ్లిపోవడానికి ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేదు.
ఇదే విషయాన్ని ఆయన- ”నేను చలన చిత్ర రంగంలో ప్రవేశించిన రోజులలో సినిమాలంటే అందరికీ చిన్న చూపు. సినిమాలలో వేషాలు వెయ్యడం, సినిమాలు తియ్యడం అంత గౌరవమైన పనులు కావనుకునే వారు. మా బంధువులలో చాలా మందికి నేను సినిమాలలో చేరడం ఇబ్బందిగా పరిణమించింది. అయితే సినిమాల పట్ల ఉన్న ఈ దుర్భావాన్ని తొలగించాలన్న ఆశయంతో నేను మరింతగా చలన చిత్ర పరిశ్రమలో లీనమయ్యాను” అని చెప్పుకున్నారొక సందర్భంలో. 1918లో ధీరేన్ కలకత్తాకు తిరుగు ప్రయాణమయ్యాడు. ధీరేన్ కు ఠాగూర్ తో దగ్గరి పరిచయం ఉంది. ఠాగూర్ రాసిన ”సాక్రిఫైస్” (త్యాగం) నాటకం అప్పటికే బెంగాల్ లో బాగా ప్రసక్తి పొందింది. దానిని సినిమాగా తీయాలనేది మదన్ ఆలోచన. అందుకొరకు అనుమతి తీసుకువచ్చాడు ధీరేన్. మరోవైపు 1918 వాటికి భారత రాజకీయాల్లో చాలా మార్పులు సంభవించాయి. అప్పటికి జలియన్ వాలాబాగ్ దురంతంతో దేశమంతా ఆగ్రహజ్వాలగా మారింది. రవీంద్రనాద్ ఠాగూర్, బ్రిటీష్ సర్కారు తనకిచ్చిన ”నైట్ హుడ్” విరుదును తిరిగి ఇచ్చేశాడు. గాంధీజీని బ్రిటీష్ ప్రభుత్వం రైల్లో పెట్టింది. పత్రికారంగంపై ఆంక్షలు విధించింది.
ఇక సినిమాలపైనైతే అప్పట్లో తయారైన సినిమాల్లో 13 సినిమాలకు పెన్నార్ వర్టిఫికెట్టు తిరస్కరించగా, 45 సినిమాల లెక్కలేనన్ని కటింగ్స్ తో అనుమతులిచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. ఇలా పలు కారణాలవల్ల మదన్ తో కలిసి దీరేన్ సినిమాల నిర్మాణం చేయలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రంగంలోకి వచ్చిన ధీరేన్ గంగూలీ నితీష్ చంద్ర లాహిరితో కలిసి 1921లో ”ఇండో బ్రిటిష్ ఫిలిం కంపెనీ’ ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా ‘బిలాత్ ఫెరాత్’ (ఇంగ్లాండ్ రిటర్న్డ్) అనే మూకి తీశారు. ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన భారతీయుడు ప్రవర్తించే తీరును వ్యంగంగా చిత్రీకరించిన ఈ చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రం తరువాత భాగస్వాములంతా విడిపోయారు.
1920ల వాటికి దేశవ్యాప్తంగా పలు నగరాలలో మూకీల నిర్మాణం ఊపందుకున్నది. హైదరాబాదులో కూడా సినిమాలు తీయాలని దీనిని గంగోలిని నిజాం ఆహ్వానిస్తూ లేఖ రాశాడు. నిజాం కోరగానే ధీరేన్ కు ఎలాగూ హైదరాబాదుతో పరిచయం ఉంది గనుక 1922లో కొందరు సినిమా టెక్నిషియన్లను తోడుగా తీసుకుని వచ్చేశాడు. హైదరాబాదులో చిత్ర నిర్మాణం కోసం ధీరేన్ స్వంతంగా లాబోరేటరీని, రెండు థియేటర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తానే పిలిపించాడు గనుక నిజం షఉటింగులకు తమ భవనాలను ఉపయోగించుకోవచ్చని ధీరేన్ కు అనుమతిచ్చాడు. ఈ అనుకూల పరిస్థితులలో హైదరాబాదులో ధీరేన్ చేసిన చిత్ర నిర్మాణం గురించి కొనసాగింపు వ్యాసంలో తెలుసుకుందాం.
(వ్యాసకర్త తెలంగాణ సినీ చరిత్రకారుడు)
- హెచ్ రమేష్ బాబు, 7780736386



