Thursday, February 12, 2026
E-PAPER
Homeకరీంనగర్వేములవాడలో క్యాంప్ వార్

వేములవాడలో క్యాంప్ వార్

- Advertisement -

ఫలితాల ముందు రాజకీయ హడావిడి..
గెలుపు ధీమాతో శిబిరాల దారి.. పొత్తులపై మంతనాలు
ఉత్కంఠలో వేములవాడ..
నవతెలంగాణ – వేములవాడ

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసి, శుక్రవారం ఫలితాల విడుదలకు కేవలం గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా వేములవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గెలుపు తమదేనన్న ధీమాతో ప్రధాన పార్టీలు అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు రంగం సిద్ధం చేయడంతో పట్టణ రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది.

కాంగ్రెస్‌కు చెందిన 28 మంది అభ్యర్థులు గురువారం సాయంత్రం క్యాంప్‌కు బయలుదేరినట్లు తెలిసింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసంలో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన సూచనల మేరకు ప్రత్యేక బస్సుల్లో శిబిరానికి తరలినట్లు సమాచారం. అయితే క్యాంప్ స్థలం, తిరుగు ప్రయాణం విషయాలపై స్పష్టత లేకపోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉండగా బిఆర్ఎస్ అభ్యర్థులు కూడా క్యాంప్‌కు తరలే ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన రాకపోయినా, “క్యాంప్ తప్పదు” అనే సంకేతాలు పార్టీ అంతర్గతంగా వినిపిస్తున్నాయి.

బీజేపీ పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. గెలుపుపై నమ్మకంతో ఉన్న ఐదుగురు అభ్యర్థులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు ఇప్పటికే క్యాంప్‌కు తరలినట్లు సమాచారం. అయితే పార్టీ లోపల వ్యూహాల విషయంలో భిన్నాభిప్రాయాలు చర్చనీయాంశమయ్యాయి.

బిఆర్ఎస్‌ తో పొత్తుపై బండి సంజయ్ సానుకూలంగా ఉన్నారనే ప్రచారం ఉండగా, స్థానిక కీలక నేత ప్రతాప రామకృష్ణ మాత్రం స్థానిక సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్‌ కు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వైస్ చైర్మన్ పీఠాన్ని లక్ష్యంగా పెట్టుకుని మంతనాలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే కాంగ్రెస్‌తో పొత్తు పార్టీకి నష్టం కలిగించే అవకాశముందని, ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలహీనపడుతుందనే ఆందోళనతో బండి సంజయ్ ఈ ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐదుగురు అభ్యర్థులను తన పరిధిలో ఉంచుకునేలా క్యాంప్‌కు తరలించినట్లు స్థానికంగా చర్చ కొనసాగుతోంది.

ఫలితాల ముందు క్యాంప్ రాజకీయాలు, పొత్తులపై ఊహాగానాలు, అంతర్గత విభేదాల చర్చలతో వేములవాడ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇక శుక్రవారం వెలువడే తీర్పే ఈ రాజకీయ సమీకరణాల కు తుది ముద్ర వేయనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -