Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరాష్ట్రపతికి కాలపరిమితి విధించవచ్చా?

రాష్ట్రపతికి కాలపరిమితి విధించవచ్చా?

- Advertisement -

– సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించిన ముర్ము
– పలు అధికరణలపై వివరణలు కోరిన ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ:
రాష్ట్ర గవర్నర్లు పంపే బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యున్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించారు. రాష్ట్రపతికి కాలపరిమితి విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదా అని సందేహం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్‌ మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ గవర్నర్లు పంపే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 201 ప్రకారం రాష్ట్రపతికి గడువు విధించింది. రాష్ట్రపతి అనుమతి కోసం తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి 10 బిల్లులను తన వద్దే అట్టి పెట్టుకోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. కాగా తాజాగా సుప్రీంకోర్టు తీర్పుపై కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ ఈ నెల 13న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ ప్రశ్నావళిని పంపినట్లు వార్తలు వచ్చాయి. తమ అనుమతి కోసం వచ్చిన బిల్లులపై చర్య తీసుకోవడానికి ఆర్టికల్‌ 143 ప్రకారం గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి నిర్దేశించి విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదా అని ఆమె ప్రశ్నించారు. ఆర్టికల్‌ 201 కింద రాష్ట్రపతి ఇచ్చే అనుమతులు సమర్ధనీయమా అనే విషయంపై సైతం సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు.
గవర్నర్‌ ముందున్న మార్గాలు ఏమిటి?
‘లైవ్‌లా’ పోర్టల్‌ ప్రకారం సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన 14 ప్రశ్నలు ఇలా ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 కింద తనకు బిల్లులు పంపినప్పుడు గవర్నర్‌ ముందు ఉన్న రాజ్యాంగపరమైన మార్గాలు ఏమిటి? ఆర్టికల్‌ 200 కింద తనకు ఓ బిల్లును పంపినప్పుడు తనకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ మంత్రిమండలి అందించే సహాయానికి, సలహాకు గవర్నర్‌ కట్టుబడి ఉంటారా? రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌ రాజ్యాంగ విచక్షణను ఉపయోగించడం న్యాయబద్ధమేనా? ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌ తీసుకునే చర్యపై న్యాయ సమీక్షకు ఆర్టికల్‌ 361 అవరోధంగా ఉన్నదా? రాజ్యాంగపరంగా కాలపరిమితి ఏదీ సూచించనప్పుడు, గవర్నర్‌ ఏ విధంగా అధికారాలను ఉపయోగించుకోవాలో నిర్దేశించనప్పుడు ఆర్టికల్‌ 200 ప్రకారం ఉన్న అన్ని అధికారాలను ఉపయోగించుకోవడానికి న్యాయపరమైన ఆదేశాల ద్వారా కాలక్రమాలను విధించవచ్చా, అధికారాలను ఎలా ఉపయోగించుకోవాలో నిర్దేశించవచ్చా?
రాష్ట్రపతి ఏం చేయాలి?
రాజ్యాంగంలోని 201వ అధికరణ కింద రాష్ట్రపతి రాజ్యాంగపరమైన విచక్షణను ఉపయోగించడం న్యాయబద్ధమేనా? రాజ్యాంగపరంగా కాలక్రమాన్ని సూచించనప్పుడు, రాష్ట్రపతి ఏ విధంగా అధికారాలను ఉపయోగించుకోవాలో నిర్దేశించనప్పుడు ఆర్టికల్‌ 201 కింద రాష్ట్రపతి తన విచక్షణను ప్రదర్శించి న్యాయపరమైన ఆదేశాల ద్వారా కాలక్రమాలను విధించవచ్చా, అధికారాలను ఉపయోగించుకోవచ్చా? రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్‌ బిల్లును తన వద్దే అట్టి పెట్టుకున్నప్పుడు లేదా ఇతర కారణాలతో అట్టి పెట్టుకున్నప్పుడు ఆర్టికల్‌ 143లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు అనుమతిని, అభిప్రాయాన్ని తీసుకోవాలా? ఆర్టికల్‌ 200 ప్రకారం గవర్నర్‌, ఆర్టికల్‌ 201 ప్రకారం రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు చట్టానికి ముందు అమలులోకి వచ్చిన దశలో న్యాయబద్ధమేనా, బిల్లు చట్టంగా మారడానికి ముందు దానిలోని అంశాలపై కోర్టులు న్యాయపరమైన తీర్పులు ఇవ్వవచ్చా?
న్యాయస్థానాల కర్తవ్యం ఏమిటి?
రాజ్యాంగపరంగా రాష్ట్రపతి లేదా గవర్నర్‌కు ఉన్న అధికారాలను, వారు జారీ చేసే ఆదేశాలను రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద మార్చవచ్చా? రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టాన్ని ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌ అనుమతి లేకుండా అమలు చేయవచ్చా? రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 145 (3)లోని నిబంధన ప్రకారం…న్యాయస్థానంలోని ఏ బెంచ్‌ అయినా తన ముందుకు వచ్చిన కేసులో రాజ్యాంగ వివరణలకు సంబంధించిన చట్టపరమైన ప్రశ్నలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ముందుగా నిర్ణయించడం, దానిని కనీసం ఐదుగురు సభ్యుల బెంచ్‌కు నివేదించడం తప్పనిసరి కాదా? కోర్టు వ్యవస్థ చట్టపరమైన అంశాలను ఏ విధంగా పరిష్కరించాలనే విషయంపై నియమ నిబంధనలు ఉన్నాయి.
ఆర్టికల్‌ 142 కింద సుప్రీంకోర్టు అధికారాలు ఆ నియమ నిబంధనలకే పరిమితమవుతాయా లేక వాటికి విరుద్ధంగా ఆదేశాలు జారీ చేస్తాయా? ఆర్టికల్‌ 131 కింద వేసే వ్యాజ్యం ద్వారా మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టుకు ఉన్న ఇతర అధికార పరిధిని రాజ్యాంగం నిషేధిస్తుందా?.
సుప్రీం తీర్పును తారుమారు చేసేలా ప్రశ్నలు : సీఎం స్టాలిన్‌ ఫైర్‌
చెన్నై: తమిళనాడు గవర్నర్‌ వర్సెస్‌ రాష్ట్ర ప్రభుత్వం వివాదం కాస్త దుమారం రేపుతోంది. రాష్ట్రపతి ముర్ము సుప్రీంకోర్టుకు ప్రశ్నలు సంధించగా..ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి సోషల్‌ మీడియాలో స్పందించారు.
బీజేపీ ఆదేశానుసారమే!
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశ్నలపై స్టాలిన్‌ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు ఇప్పటికే వెలువరించిన తీర్పును తారుమారు చేసేలా ఉన్న రాష్ట్రపతి ప్రశ్నలకు తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ చెప్పినట్టు వ్యవహరించా రనే వాస్తవాన్ని ఈ ప్రయత్నం స్పష్టంగా వెల్లడిస్తుందని అన్నారు.
సుప్రీం అధికారాలకే ఇది సవాలు!
సుప్రీంకోర్టు తీర్పును ముర్ము ప్రశ్నించడం ప్రజాస్వామ్యపరంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నమని స్టాలిన్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు అధికారాన్ని ఇది సవాలు చేస్తుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేసే గవర్నర్ల నియంత్రణలో ఉంచడం ద్వారా బలహీనపరిచే తీవ్ర ప్రయత్నం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు.
‘అభ్యంతరం ఎందుకు?’
రాష్ట్ర శాసనసభ ఆమెదించిన బిల్లులపై గవర్నర్లు చర్య తీసుకోవడానికి సమయ పరిమితులను నిర్ణయించడంపై లేవనెత్తిన అభ్యంతరాలను స్టాలిన్‌ ప్రశ్నించారు. ”గవర్నర్లు వ్యవహరించడానికి సమయ పరిమితులను నిర్ణయించడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? బిల్లు ఆమోదంలో నిరవధిక జాప్యాలను అనుమతించడం ద్వారా బీజీపీ తన గవర్నర్ల అడ్డంకిని చట్టబద్ధం చేయాలని చూస్తుందా? కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్ర శాసనసభలను స్తంభింపజేయాలని అనుకుంటుందా?” అంటూ క్వశ్చన్‌ చేశారు. బీజేపీయేతర రాష్ట్ర, పార్టీ నాయకులు చట్టపరమైన పోరాటంలో పాల్గొనాలని స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ”మన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాష్ట్ర శాసనసభలను నిర్వీర్యం చేయాలనే బీజేపీ నేత ృత్వంలోని కేంద్ర ప్రభుత్వ దుష్ట ఉద్దేశాన్ని ముర్ము ప్రశ్నలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల ఇది రాష్ట్ర స్వయంప్రతిపత్తికి ముప్పును కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రక్షించడానికి చట్టపరమైన పోరాటంలో చేరాలని అన్ని బీజేపీయేతర రాష్ట్రాలు, పార్టీ నాయకులను కోరుతున్నాను. మన శక్తి మేరకు పోరాడుదాం. తమిళనాడు పోరాడుతుంది. తమిళనాడు గెలుస్తుంది!” అంటూ పోస్ట్‌ చేశారు స్టాలిన్‌.
రాజ్యాంగంపై దాడి : రాష్ట్రపతి ప్రశ్నావళిపై సీపీఐ (ఎం)
న్యూఢిల్లీ: తమిళనాడు వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా ప్రశ్నావళిని సంధించడాన్ని సీపీఐ (ఎం) నిరసించింది. ఇది సుప్రీంకోర్టు తీర్పు నుంచి తప్పించుకోవడమే అవుతుందని వ్యాఖ్యానించింది. రాజ్యాంగం యొక్క సమాఖ్య స్వభావాన్ని, రాష్ట్రాల హక్కులను సుప్రీం తీర్పు పరిరక్షించిందని గుర్తు చేసింది. రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టుకు ప్రశ్నలు పంపడం రాజ్యాంగంపై జరిగిన మరో దాడిగా సీపీఐ (ఎం) అభివర్ణించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img