Tuesday, July 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసర్కారుబడిని సరిచేసుకోలేమా?

సర్కారుబడిని సరిచేసుకోలేమా?

- Advertisement -

తమ పిల్లలకు ‘మంచి’ చదువు చెప్పించాలనే తల్లిదండ్రుల ఆరాటం కాస్తా విద్యావ్యాపారానికి దారితీస్తున్నది. నాణ్యమైన విద్య కావాలనే వారి తపనను తప్పుపట్టలేం. కానీ, ఇక్కడ గమనించాల్సింది చదువులేని లేదా అరకొర చదువులతో చట్టబండలైన తమ బతు కుల్లా కాకుండా, సగం కడుపు మాడ్చుకొనైనా, నెలనెలా ఫీజుకు కష్టమైనా సరే తమ పిల్లలను చదివించుకోవాలనే నిర్ణయం ప్రయివేటు యాజ మాన్యాల విద్యావ్యాపారానికి ఊతంగా మారాయి. తల్లితండ్రుల ఆశలే కార్పొరేట్ల దోపిడీ మార్గాలయ్యాయి. అయితే ఇక్కడ మనం చూడా ల్సింది సర్కార్‌ విధానాలే. చదువు ‘రాజ్యం’ బాధ్యత కదా! మరి పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే… ‘మేం చేయలేనిదేముంది. గ్రామాలు, ఆవాసాలు అన్ని చోట్లా బడులు పెట్టాం. గురుకులాలు కూడా ప్రారంభించాం. దుస్తులు, పుస్తకాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అన్నీ సమకూర్చుతున్నాం’ అనే సమాధానం లభిస్తుంది. మరి ఇలాంటి ప్రభుత్వ స్కూళ్లు ఇన్ని ఉన్నప్పుడు ప్రయివేటు అవసరమేమిటి? ప్రభుత్వ బడుల్లో పిల్లలు బోలోమని చేరడంతో పూర్తిగా నిండిపోయి కొత్తగా చేర్చుకోవడం లేదా? అంటే అదేం లేదు! రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు లేని పాఠశాలలు 1980 ఉండగా, ఉపాధ్యాయుల చొరవతో ఈ విద్యాసంవత్సరం అందులో 140 పాఠశాలలు తిరిగి ప్రారంభించబడినవి.
బడైతే పెట్టారు కానీ దానిపట్ల తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పాదుకొల్పలేకపోయారు పాలకులు. ఈ నమ్మకం సన్నగిల్లడానికి కారణాలు చాలానే ఉన్నాయి. బడి భవనం ఉన్నా దాన్ని రోజూ ఊడ్చే వారుండరు. అటెండరు కానరారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం అంతకన్నా ఉండవు. పాఠశాల మూసిన తర్వాత పట్టించుకునేందుకు వాచ్‌మెన్‌ లాంటి నాధుడే కనపడడు. మరుసటిరోజు వచ్చేసరికి పాఠశాల ఆవరణ ఎలా ఉంటుందో చెప్పలేని సందర్భాలనేకం. ఎందుకంటే ఆబడి ఊరు ఉమ్మడి ఆస్తికదా! సబ్జెకు టీచర్ల కొరత సరేసరి. పదేండ్ల కాలం ప్రధానో పాధ్యాయులు, మండల విద్యాధికారులు లేకుండానే పాఠశాల విద్యను ఈడ్చు కొచ్చారు. నేటికీ మొత్తం 625 మండలాలకుగాను 606 మండ లాల్లో ఎంఈఓలు లేరు. 58 ఉపవిద్యాశాఖాధికారుల పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. 33 జిల్లాలకుగాను 12 పూర్తిస్థాయి డిఈఓ పోస్టులు మాత్రమే ఉన్నాయి. గొప్పలు చెప్పుకున్న గురుకులాలన్నీ అద్దె భవనాల్లో ఇరుకు గదుల ఫ్లాట్లలో, పిల్లల మాటల ప్రతిధ్వనుల మధ్య కొనసాగు తున్నాయి. అనేక తంటాలు పడుతూ నెట్టుకొస్తున్నారు ప్రిన్సిపాళ్లు, టీచర్లు. ప్రభుత్వ బడి అంటే విశ్వాసం లేనిదిగా మారడానికీ కారణాలు చాలవా? ఇవన్నీ ఎలా ఉన్నా సమాజానికి కనిపించేది ఉపాధ్యాయులే. అపవాదు అంతా వారిపైతోసే ప్రయత్నమూ తక్కువేం కాదు! దీని వెనుక కార్పొరేట్ల ప్రోద్బలం సహజంగానే ఉంటుంది. టీచర్ల పిల్లలే మా బడిలో చదువుతున్నారంటూ విద్యావ్యాపారులు చేసే ప్రచారం మా మూలుగా ఉండదు. అం తెందుకు కార్పొరేట్‌ విద్యాసంస్థల అధిపతులే ప్రభుత్వ విద్యను కాపాడే ప్రతినిధులుగా చట్టసభలకు ఎన్నికై శాసనాలు చేసే స్థాయికి ఎదిగారు.
ఏదేమైనా ‘బడిని బతికించుకోవడం’ పౌరసమాజం బాధ్యత. అందులో టీచరు కూడా భాగస్వామి. అందుకే నేడు రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవుల్లో సైతం ప్రగతిశీల కాముకులైన ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా విద్యార్థుల నమోదు పెంచేందుకు జాతాలు నిర్వహిం చారు. తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మే 25 నుండి జూన్‌ 5 వరకు గ్రామగ్రామాన సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు. తల్లితండ్రులకు, ప్రజలకు ‘బడి అంటే ముందు మేము, పిల్లలమేకదా!’ ‘మీ పిల్లల చదువుకోసం మేమున్నాం.’ వారు చదువుకునే ఈ బడికేం కావాలో, ఈ బడిలో ఏం ఉండాలో చెపుతాం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చివాటిని సాధించుకుందాం! నాణ్యమైన చదువెందుకుండదు? మేమంతా ఇలాంటి బడుల్లోనే కదా! చదువుకున్నది అని చెపుతూ విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ‘తెలంగాణ పౌరస్పందన వేదిక’ లాంటి ప్రజా సంఘాలు విద్య, వైద్యం, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలని ప్రచార జాతాలు, తల్లితండ్రులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు. సర్కారు బడిపట్ల సానుకూలతను పెంచుతూ గ్రామస్తుల్లో సమిష్టిగా ఊరిబడిని కాపాడుకోవాలనే తపనకై కృషి చేస్తున్నారు.
పాఠశాల విద్యకుచేసే కేటాయింపులు భవిష్యత్‌ అభివృద్ధి కోసం వెచ్చించే పెట్టుబడిగా భావించనంత కాలం పరిస్థితుల్లో మార్పు ఆశించడం కష్టమైన పనే. గత ప్రభుత్వం దాదాపు పదేండ్లకాలం ముఖ్యమంత్రి స్థాయిలో విద్యారంగంపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేయ లేదంటే, ప్రభుత్వ విద్యపట్ల పాలకుల నిబద్ధతకు ఇంతకు మించిన కొలమానం ఇంకేముంటుంది? అందుకే బడ్జెటుతో పాటు పాలకవర్గ చిత్తశుద్ధి అంతే ముఖ్యం. అసలు ఉన్న పరిస్థితుల్లోనే ఏం చేయగలమనేది నిర్ణయించి తక్షణ అమలు ప్రారంభించాలి. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక విద్యా సంవత్సరం గడిచిపోయి, రెండోది ప్రారంభమైంది. గతేడాది ఏం జరగలేదా, కొత్త ప్రభుత్వం ఏం చేయలేదా అంటే పదోన్నతులు, బదిలీలు ఉపాధ్యాయుల్లో ఉన్న అశాంతిని కొంతమేరకు దూరం చేసినా, అసలు సమస్యలపై కేంద్రీకరించ లేదనే చెప్పాలి.
ఒక రోజంతా శాసన మండలిలో విద్యపై పూర్తిస్థాయి చర్చ చేయడం, విద్యాకమిషన్‌ ఏర్పాటు చేసి మౌలిక మార్పులపై సిఫారసులు కోరడం ఆహ్వానించ దగ్గ చర్యే. అయితే ఫలితాలిచ్చే పని మొదలు కావడానికింకా సమయం కావాలంటే ఆత్రం నిర్లిప్తత, ఉదాసీనతకు గురైన విద్యారంగాన్ని ఆ పరిస్థితులనుండి బయటపడేసేందుకు, సరిచేసేందుకు ఒక ప్రభుత్వాని కుండే ఐదేండ్ల కాలంలో గడిచిన ఏడాదిన్నర కాలం తక్కువేమీ కాదు! జరిగే జాప్యానికి కారాణలేవైనా గత పాలకులకు ప్రస్తుత ప్రభుత్వానికి తేడా పెద్దగా ఏముంది?అని చెప్పుకునేందుకు ఆస్కార మిచ్చినట్లవు తుంది. కీలకమైన ఉపాధ్యాయ విద్యనందించే కళాశాలలు అధ్యాపకుల ఖాళీలతో కునారిల్లి పోతు న్నాయి. రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ (యస్‌సిఈ ఆర్‌టి) డిప్యుటేషన్లకు నిలయంగా మారింది. డైట్‌, జూనియర్‌ కళాశాలల్లో, దశాబ్ద కాలంగా ఖాళీలు కొనసాగుతున్నాయి. ఉప విద్యాశాఖాధికారులు లేనేలేరు. కొత్త మండలాలకు ఎంఈఓలు, జిల్లాలకు డీఈఓ పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. 2000 స్కూల్‌ అసిస్టెంట్స్‌, ఏడువేల ఎస్జీటీ ఖాళీలున్నాయి.
ఇలాంటి సమస్యల సుడిగుండంలో కూడా సగటు ఉపాధ్యాయుడు బడి బాధ్యత నాదే అని భావించడం అత్యంత ప్రధానం. ఇది సమాజం పట్ల రేపటి పౌరుల భవిష్యత్తు పట్ల ఉపాధ్యాయులకున్న బాధ్యతకు నిదర్శనం. నేడు అనేకచోట్ల ఉపాధ్యాయులు స్వచ్ఛం దంగా బడికోసం అవసరమైన డబ్బులు సైతం వెచ్చించి నిధులు సేకరించి, వేసవి సెలవులన్నీ వినియోగించి బడిబాగు కోసం కృషి చేస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే కొన్ని చోట్ల విద్యార్థుల నమోదు పెరిగి ‘నో అడ్మిషన్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గతంలో మూసివేయబడ్డ బడులను పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల సహకారంతో తిరిగి ప్రారంభిస్తున్నారు. విమర్శలకు సమాధానంగా మా పిల్లలను మా పాఠశాలలోనే చదివించు కుంటామని కొందరు ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇలాంటివెన్ని చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నపుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. పాలకులు కేవలం ఎన్నికల కోసం ఆకర్షణీయ హామీలుగా కాకుండా నిర్ధిష్ట చర్యలతో ముందుకెళ్లాలి. మాటలతో కాలం వెళ్లదీయకుండా ఆ వెంటనే మొదటి అడుగుపడాలి. సాధించిన ఫలితాలు, మెరుగైన పరిస్థితులు రాబోయే కాలంలో తమ రాజకీయ లక్ష్యానికి తోడవుతాయని, విద్యారంగానికి పెట్టే ఖర్చు సమాజం భవిష్యత్తుకు బాటవేస్తుందని, దేశ రాజకీయ భవిష్యత్తు సైతం అందులో ఇమిడి ఉంటుందనే వాస్తవాన్ని పాలకులు గుర్తించాలి.

పి.మాణిక్‌రెడ్డి
9440064276

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -