Friday, February 20, 2026
E-PAPER
Homeజాతీయంకులదూషణ చేశారు

కులదూషణ చేశారు

- Advertisement -

భౌతికంగా దాడికి దిగారు
నిరంతరం హింసిస్తున్నారు
ఇది ఏబీవీపీ కార్యకర్తల పనే
వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
సీయూజీ ఘటనపై బాధిత దళిత విద్యార్థి ఆరోపణలు
రెండు వర్గాల మధ్య ఘర్షణగా చెప్తున్న వర్సిటీ యంత్రాంగం

గాంధీనగర్‌ : దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కుల వివక్ష అంశం మళ్లీ చర్చకు దారితీస్తున్నది. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ గుజరాత్‌ (సీయూజీ)లో గతనెల 26-27 మధ్యరాత్రి జరిగిన ఘర్షణపై తీవ్ర వివాదం చెలరేగిన విషయం విదితమే. సబర్మతి హాస్టల్‌లో దళిత విద్యార్థిపై దాడి జరిగింది. దీనికి సంబంధించి బాధిత విద్యార్థి రాజ్‌కరణ్‌ సింగ్‌ ఇప్పటికే వర్సిటీ యంత్రాంగానికి ఫిర్యాదు చేశాడు. తనపై దాడి జరిగిందనీ, కులం పేరుతో దూషించారనీ, అసభ్య పదజాలంతో బెదిరింపులకు దిగారని పేర్కొన్నాడు. దాడిలో పాల్గొన్నవారు ఆరెస్సెస్‌ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీకి చెందినవారని ఆరోపించాడు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాడు. అయితే వర్సిటీ యాజమాన్యం మాత్రం ఈ ఘటనను ”రెండు వర్గాల మధ్య జరిగిన సాధారణ గొడవగా” చెప్తున్నది. ఎలాంటి కుల వివక్షా జరగలేదని చెప్తున్నది.

ఏం జరిగింది?
బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. గతనెల 26న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో సుమారు 30 మందితో కూడిన ఒక మూక హాస్టల్‌ లోపలికి చొరబడింది. విద్యార్థులపై దాడి చేసింది. కర్ఫ్యూ ఉన్నప్పటికీ వారు లోపలికి ప్రవేశించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ దాడి తెల్లవారుజామున 3 గంటల వరకూ సాగింది. తనను కులం పేరుతో దూషించారనీ, భౌతిక దాడికి దిగారని బాధితుడు ఆరోపించాడు. అంతేకాదు.. తన భవిష్యత్తును కూడా పాడు చేస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. తన ఫిర్యాదులో విద్యార్థి ఏబీవీపీకి చెందిన మున్నా కుమార్‌, టప్పు మహారాణాతో పాటు పలువురి పేర్లను ప్రస్తావించాడు. గతంలోనూ ఇలాంటి ఘటనల్లో వీరి హస్తమున్నదని ఆరోపించాడు.

మున్నా కుమార్‌ యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు.సదరు విద్యార్థి సోషల్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం విద్యార్థి. యూజీ మొదటి సంవత్సరం చదువుతూ.. సబర్మతి హాస్టల్‌లో ఉంటున్నాడు. కాగా తనపై నిరంతరం వేధింపులు, కుల దూషణలు జరుగుతున్నాయనీ, తాను యూనివర్సిటీలో అడ్మిషన్‌ తీసుకున్న మొదటి రోజు నుంచే పరిస్థితి ఇలా ఉన్నదని విద్యార్థి… సీయూజీ ప్రోవోస్ట్‌, రిజిస్ట్రార్‌, డీన్‌కు గతనెల 28న మెయిల్‌ కూడా చేశాడు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) కింద కేసు నమోదు చేయాలని బాధితుడు డిమాండ్‌ చేశాడు. దర్యాప్తు పూర్తయ్యే వరకూ నిందితులను సస్పెండ్‌ చేయాలనీ, సీసీటీవీ ఫుటేజీ ఫోరెన్సిక్‌ విశ్లేషణ చేయాలని కోరారు. కాగా ఘటనకు ముందు నిందితులు సీసీటీవీ కెమెరాలు ఆపివేసినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. అయితే యూనివర్సిటీ మాత్రం దీనిని పూర్తిగా ఖండించింది.

యూనివర్సిటీ వివరణ
సీయూజీ ప్రజాసంబంధాల అధికారి డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘటన రెండు వర్గాల మధ్య జరిగిన చిన్న గొడవ మాత్రమే అని అన్నారు. కుల వివక్ష జరిగినట్టు ఆధారాలు లభించలేదని తెలిపారు. ఇతర దళిత విద్యార్థులు కూడా కులదూషణలు జరగలేదని లిఖితపూర్వకంగా తెలియజేశారని అన్నారు. విశ్వవిద్యాలయం ప్రాక్టోరియల్‌ బోర్డు, క్రమశిక్షణా కమిటీ, ఎస్సీ, ఎస్టీ సెల్‌ ద్వారా దర్యాప్తు జరిగిందనీ, సీసీటీవీ ఫుటేజీ పరిశీలించామని యాజమాన్యం తెలిపింది.

ఒకవైపు బాధిత విద్యార్థి కులదూషణ, హింస జరిగిందని తీవ్ర ఆరోపణలు చేస్తుండగా.. మరోవైపు యూనివర్సిటీ మాత్రం దీనిని సాధారణ గొడవగా అభివర్ణించడం చర్చకు దారి తీస్తున్నది. విద్యార్థి చేసిన ఆరోపణలు ఏబీవీపీపై కావడం, కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌లు అధికారంలో ఉండటంతో విద్యార్థి ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవడం లేదనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ ఘటనపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరపాలని బాధిత విద్యార్థి.. కేంద్రాన్ని కోరారు. ఈ అంశంలో తుది నివేదిక రాకముందే.. విద్యాసంస్థల్లో కులవివక్ష అంశం మళ్లీ తెర మీదకు రావటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -