Tuesday, October 14, 2025
E-PAPER
Homeజాతీయంకరూర్‌లో తొక్కిసలాటపై సీబీఐ

కరూర్‌లో తొక్కిసలాటపై సీబీఐ

- Advertisement -

దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ:
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజరు కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటన పై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు నిరాకరించడంతో పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తుపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అజరు రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిపింది.
కరూర్‌ తొక్కిసలాట నేపథ్యంలో పౌరుల ప్రాథమిక హక్కులపై జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, ఎన్‌.వి.అంజరియాలతో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. దీనిపై అన్ని పార్టీలు వ్యక్తంచేస్తున్న అనుమానాలు తొలగాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని.. అందువల్లే ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రతినెలా కేసు పురోగతిని కోర్టుకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజరుకరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కరూర్‌ తొక్కిసలాట ఘటన పై సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును విజరు ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అస్రాగార్గ్‌ ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటైంది. పోలీసుల దర్యాప్తు, అధికారుల పాత్రపై తాము ఇదివరకే ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ.. రాష్ట్ర పోలీసు అధికారులతోనే మద్రాస్‌ హైకోర్టు సిట్‌ను ఏర్పాటుచేసిందని టీవీకే తన పిటిషన్‌లో పేర్కొంది.
తమ పార్టీపై సిట్‌ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీవీకే అధ్యక్షుడు విజరుకు నాయకత్వ లక్షణాల్లేవని, ఘటన జరిగిన వెంటనే ఆ పార్టీ నేతలంతా పారిపోయారని వ్యాఖ్యానించిన మద్రాసు హైకోర్టు… కరూర్‌ ఘటనపై ఆ పార్టీ తీరును తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఈవిషయాన్ని టీవీకే పార్టీ తన పిటిషన్‌లో ప్రస్తావించింది. ఆ వ్యాఖ్యలు ఇప్పటికే దర్యాప్తును ప్రభావితం చేశాయని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -