నవతెలంగాణ – పరకాల
పరకాల ప్రాంత పేదల పెన్నిధి, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు రౌతు మనోహర్ 5వ వర్ధంతి వేడుకలను జయప్రదం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు బోట్ల చక్రపాణి కోరారు. పట్టణంలోని మనోహర్ స్తూపం వద్ద శుక్రవారం నిర్వహించే ఈ స్మరణ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. రౌతు మనోహర్ తన జీవితాంతం ఎర్రజెండా నీడన కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం పోరాడారని గుర్తుచేశారు.
నాలుగు దశాబ్దాల పాటు ‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదంతో భూపోరాటాలు నిర్వహించడమే కాకుండా, పాలేర్లు, హమాలీ కార్మికుల హక్కుల కోసం వృద్ధాప్యంలోనూ వెనకడుగు వేయకుండా పోరాడిన ధీశాలి అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసమే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష అభిమానులు, కార్మికులు, బంధుమిత్రులు పాల్గొని సభను విజయవంతం చేయాలని చక్రపాణి పిలుపునిచ్చారు.



