అడ్డుగా ఉన్న ఏజెంట్ల సంఖ్య తగ్గింపునకు చర్యలు
ఎల్‌ఐసీ పరిరక్షణకు ఏఓఐ పోరాటం
8,9 తేదీల్లో ఖమ్మం కేంద్రం గా ఎల్‌ఐసీ (ఏఓఐ) సౌత్ సెంట్రల్ జోన్ సమావేశం : ఎల్. మంజునాథ, పిఎల్. నరసింహారావు
నవతెలంగాణ-ఖమ్మం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)ని ప్రయివేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఎల్‌ఐసీ ఏజెంటస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఏఓఐ) ఆల్ ఇండియా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.మంజునాథ, జోన్ ప్రధాన కార్యదర్శి పిఎల్.నరసింహారావు అన్నారు. దానిలో భాగం గానే బీమాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచుతూ వస్తోందని తెలిపారు. ఖమ్మంలోని మంచికంటి హాల్‌లో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పది బీమా కంపెనీల్లో ఎల్‌ఐసీ మూడో స్థానంలో ఉందన్నారు. మధ్య భారత దేశంలో మొదటి స్థానంలో సంస్థ ఉందని తెలిపారు. అభివృద్ధి పనులతోపాటు ప్రజా సంక్షేమ పథకాలకు అవసరమైన ఆర్థిక వనరుగా ఎల్‌ఐసీని కేంద్ర ప్రభుత్వం వినియో గించుకుంటోందని తెలిపారు.
2025 నాటికి ఎల్‌ఐసీ మొత్తం ఆస్తుల విలువ రూ.57 లక్షల కోట్లుగా ఉందని, దీనంతటికీ ఏజెంట్లు ప్రధాన కారణమని చెప్పారు. సంస్థకు, ప్రజలకు మధ్య రాయబారులుగా ఉండి, పాలసీలను అమ్మి ఆస్తులను కూడబెట్టారని తెలిపారు. ఇప్పుడు ఈ ఆస్తులను ప్రయివేటీ కరించేందుకు కేంద్రం బీమా చట్టాలను సవరించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రారంభంలో 26 శాతం ఉన్న విదేశీ పెట్టుబడులను మోడీ ప్రభుత్వం 74 శాతానికి చేర్చిందన్నారు. ఇప్పుడు దానిని వంద శాతానికి పెంచేలా చర్యలు చేపట్టిందన్నారు. దీనికి అడ్డుగా ఉన్న ఏజెంట్లను తొలగిం చేందుకు కుట్రలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలసీదారులకు బోనస్‌లు ఇవ్వడం లేదని, ఏజెంట్లకు ఇచ్చే కమీషన్లను పెంచక పోగా.. అక్టోబర్ 24 నుంచి కమీషన్ రేటును 7 శాతం తగ్గించిందని, కొత్త క్లాంబ్యాక్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని అన్నారు.
2047 నాటికి అందరికీ బీమా పేరుతో ఉన్న బీమా వ్యవస్థను ప్రయివేట్, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే విధానాన్ని కేంద్రం అమలు చేయబోతుందని చెప్పారు. ఎల్‌ఐసీని నిర్వీర్యానికి కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఎల్‌ఐసీ ఏఓఐ పోరాడుతుంద న్నారు. ఎల్‌ఐసీని ప్రజా సేవారంగంలోనే కొన సాగించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 8, 9 తేదీల్లో ఎల్‌ఐసీ ఏఓఐ 6వ సౌత్ సెంట్రల్ జోన్ సమావేశం ఖమ్మంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎల్‌ఐసీని కాపాడటం, పాలసీదారులు, 14.88 లక్షల మంది ప్రతినిధుల ప్రయోజనాలను పరిరక్షించడం లక్ష్యంగా ఈ కాన్ఫరేన్స్ జరుగుతుందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
రెండు రోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్‌లో తొలి రోజు ప్రారంభోత్సవ సభకు సీఐటీయు ఆలిండియా కోశాధికారి ఎం.సాయిబాబు, ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ పునిత్ కుమార్, ఏఓఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సుర్జిత్ కుమార్ బోస్ ప్రసంగిస్తారని తెలిపారు. రెండ్రో జులపాటు జరిగే కాన్ఫరెన్స్‌ను జయప్రదం చేయాలని ఏజెంట్లకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ అధ్యక్షుడు తాళూరి శ్రీనివాస్, జోన్ వైస్ ప్రెసిడెంట్ నాగరత్నమ్మ, జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్, జోన్ కమిటీ కార్యదర్శి వలి మోహిద్దీన్, మందపల్లి సురేష్, ఉసికల ప్రసాద్, వెంకటరమణ, రాజయ్య, శ్రీని వాసరావు, యర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఐసీ ప్రయివేటీకరణకు కేంద్రం కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



