-గాంధీ పేరే కాదు.. కూలీల హక్కులే మాయం.!
-ఉపాధి హామీని నీరుగార్చేందుకు కేంద్రం కుట్ర
-ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
నవతెలంగాణ – రాయికల్
రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో రూ.10 లక్షల ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధులతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి రూ.10 లక్షల చొప్పున రెండు పనులకు,అలాగే రూ.30 లక్షలతో ఒక గోదాం మంజూరు చేస్తుందని తెలిపారు. గ్రామాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, అభివృద్ధి కోసం అధికార పార్టీతో సమన్వయంతో ముందుకెళ్తున్నానని పేర్కొన్నారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును విబిజి రామ్ (వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్)గా మార్చి కఠిన నిబంధనలు అమలు చేయడం సరికాదన్నారు. గాంధీ పేరు స్థానంలో రాముని పేరు పెట్టారని వ్యాఖ్యానించిన ఆయన, రామరాజ్యం అంటే ప్రజలకు మేలు చేయాల్సిందే కానీ నష్టపరిచే విధంగా ఉండకూడదన్నారు. పేరుకే 100 నుంచి 125 పని దినాలు పెంచినట్లు చెప్పడం ఆచరణలో అసాధ్యమని ఎద్దేవా చేశారు.
పేరు మార్పుపై తనకు అభ్యంతరం లేదని, కానీ ఉపాధి హామీ పథకంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నిబంధనల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, మధ్యతరగతి, భూమిలేని కూలీల కోసం తీసుకొచ్చిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం ఏదో ఒక రూపంలో నిధులు ఇస్తూ, తెలంగాణలో మాత్రం ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ కూలీల పక్షాన విబిజి రామ్ పథకాన్ని పూర్తిగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి జీఎస్టీ రూపంలో భారీగా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 40 శాతం నిధులపై నిబంధనలు విధించడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి.చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, సెర్ప్ ఏపీఎం నరహరి, సర్పంచ్ దిండిగల గంగు, ఉపసర్పంచ్ దుంపల నర్సారెడ్డి, మాజీ ప్యాక్స్ చైర్మన్ రాజరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రావు, నాయకులు రామస్వామి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



