పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయి. పుస్తకాలకు బై చెప్పి, స్నేహితులతో కలిసి ఆటపాటల్లో మునిగిపోతారు. ఎంతగా అంటే వాళ్లుకు దాహం వేయదు. అసలు అన్నం తినాలన్న ఆలోచనే రాదు. ఇది నేటి తల్లులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. ఇక పిల్లల ప్రవర్తనతో అమ్మలకు తలనొప్పి మొదలవుతుంది. సెలవులు పూర్తయ్యే వరకు వాళ్లను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తెగ ఇబ్బంది పడుతుంటారు. అయితే పిల్లలను కంట్రోల్ చేయడం అనే ఆలోచనే సరైనది కాదని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఎలా డీల్ చేయాలనే విషయంలో నిపుణులు పలు సూచనలు
చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
స్కూల్ లేదనే సాకుతో పిల్లలు సమయానికి లేవరు, చెప్పిన పనిచేయరు, టైంకి అన్నం తినరు. ఇవన్నీ అమ్మల ఓపికకు పరీక్ష పెడతాయి. పిల్లలకు పదే పదే చెప్పినా వినకపోతే అరవడం, దండించడం లాంటివి చేస్తుంటారు. ఈ పద్ధతి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
రూల్స్ పెట్టండి
పిల్లలకు క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అయితే అది వాళ్లల్లో భయం, అవమానం కలిగించేలా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. సానుకూలత నింపేలా మీపై గౌరవం, నమ్మకం పెంచేలా ఉండాలంటారు. అప్పుడే పిల్లల్లో సానుకూల ధోరణి, సహానుభూతి వంటివి ఏర్పడతాయని వివరిస్తున్నారు. ‘ఇవాళ కాసేపు ఆడుకోవచ్చుగా’ అని చెప్పి, మరుసటి రోజు ‘ఎంతసేపూ ఆటలేనా?’ అంటూ రోజుకో తీరుగా మాట్లాడితే పిల్లలకు తికమకగా ఉంటుందని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. ఇలా కాకుండా ఫలానా టైంకి లేవాలి. టిఫిన్, లంచ్ ఫలానా టైమ్ లోపు పూర్తి కావాలి. ఏ టైంలో, ఎంత సేపు ఆడుకోవాలి అనే విషయాలను కచ్చితంగా చెబితే వాళ్లకీ సృష్టత వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నియమాలనే వారు అనుసరిస్తారని చెబుతున్నారు నిపుణులు.
ప్రోత్సహించాలి
పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కొందరు తల్లిదండ్రులు వెనకాముందు చూడకుండా తిట్టేస్తారు. అదే మంచి పని చేస్తే మాత్రం చూసీ చూడనట్లు ఉండిపోతారు. ఇలాంటి పద్ధతిని తల్లిదండ్రులు మార్చుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. మంచి పనులు చేస్తే పిల్లలను ప్రోత్సాహించాలి. అందుకోసం వాళ్లకు చిన్న బహుమతి, ముద్దు, హగ్ లాంటివి ఇవ్వాలని సూచిస్తున్నారు. అప్పుడే పిల్లలు మంచి పనులను ఆనందంగా కొనసాగిస్తారు.
అసహనం పనికి రాదు
పిల్లలు పెద్దవాళ్లకి గౌరవం ఇవ్వనప్పుడు గట్టిగా మాట్లాడొద్దు, అరవొద్దు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితిలో అసహనం పనికిరాదని నిపుణులు చెబు తున్నారు. మీరు ఎన్నెన్ని చెప్పినా పిల్లలు వినరు. వారు మిమ్మల్ని చూసి మాత్రమే నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలు పాటించాలను కున్నవి ముందు మీరు అనుసరిం చ మంటున్నారు నిపుణులు. నిదానంగా వారిలోనూ మార్పు వస్తుందని చెబుతున్నారు. ఒకసారి మీరు చెప్పిన మాటలు వినలేదా? అయితే వాళ్లనే తెలుసుకోనివ్వండని సూచిస్తున్నారు.
ఛాయిస్ ఇవ్వండి
పిల్లలను ఇది చెరు, అది చెరు అంటే వాళ్లకీ ఆజ్ఞలాగే ఉంటుంది. వారికి అది కష్టంగా అనిపిస్తుంది. బదులుగా వారికే ఛాయిస్ ఇవ్వంటున్నారు నిపుణులు. ఈరోజు రూమ్ సర్దుకుంటావా? దుస్తులు మడత పెట్టుకుం టావా? అని మీరు వాళ్లనే అడగండి. అప్పుడు వారు నచ్చింది ఎంచుకుం టారు. దీంతో పనీ తొందరగా పూర్తవుతుంది. ఎంచుకునే అవకాశం వచ్చినందుకు పిల్లలు చాలా సంతోషిస్తారు.
సమయం కేటాయించండి
పిల్లలకు సెలవులు ఇచ్చారని ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు సెలవులు దొరకవు. కాబట్టి ఉన్న దాంట్లోనే ఈ సెలవుల్లో పిల్లలతో కాస్త సమయం గడిపేందుకు ప్లాన్ చేసుకోండి. సరదాగా పిల్లలను తీసుకొని అప్పుడప్పుడు బయటకు వెళ్ళండి. ఏవైనా ఆహ్లాదకరమైన, అందమైన, చారిత్రాత్మక ప్రదేశాలు పిల్లలకు చూపించండి. దీనివల్ల పిల్లలకు ఆనందంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించిన వారు అవుతారు. ఈ విధంగా కాస్త ఓపికతో ఉంటూ తల్లి దండ్రులు పిల్లలను అర్థం చేసుకోవాలి. ఈ సెలవులు ఎందుకు వచ్చాయా అని తల పట్టుకో కుండా ప్రేమతో వాళ్ళను దారిలో పెట్టండి. అంతే కానీ కోపంతో, చిరా కుతో కంట్రోల్ చేయాలని మాత్రం చూడొద్దు. ఇది వారి ఎదుగుదలకు అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
కోపం అదుపులో..
పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే ముందు మీకు వచ్చేది కోపమే. అందుకే మొదట దండన దిశగా ఆలోచిస్తారు. అయితే ఈ సారి ఇలా కాకుండా ఈ విధంగా చేస్తే బాగుండేది అన్న చిన్న సలహా ఇవ్వండి. ఇంకెలా చేయొచ్చో పిల్లలను ఆలోచించమని చెప్పండి. దీంతో వారి ఆలోచనా తీరు మార్చుకుంటారు. మీరు గట్టిగా చెప్పండి కానీ గొంతు మాత్రం పెద్దగా చేయవద్దు. ఐ కాంటాక్ట్ ఇవ్వడమూ మర్చిపోవ దంటున్నారు నిపుణులు.