నవతెలంగాణ – జుక్కల్
కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం సరైన పద్ధతి కాదని, బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని బోర్గి సంజీవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతోపాటు, స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని బోర్గి సంజీవ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ ఇవ్వకపోవడం, మహిళలకు గృహలక్ష్మి ఇవ్వకపోవడం, రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడం ఆలోచించుకోవాలని అన్నారు.
రైతు బంధు, రైతు భీమా, సకాలంలో ఇవ్వకపోవడం, జుక్కల్ నియోజకవర్గ ప్రజలు వివిధ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కడం, దిష్టి బొమ్మలు దహనం చేయడం తప్పితే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు మీరు చేసిన అభివృద్ది ఏంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకపోగా ప్రతిపక్ష నాయకులను విమర్శించడం తగదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బూతు భాషల తీరు వల్లనే కేటీఆర్ విమర్శ చేసే పరిస్థితి వచ్చిందని, సీఎం భాష తీరు మార్చుకోకుంటే? తెలంగాణ ప్రజలు కూడా అదే భాషలో మాట్లాడుతారని అన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బూతులు మాట్లాడడం ఎంత వరకు సబబు అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.
ముఖ్యమంత్రి భాష తీరు మంత్రులకు, ఎమ్మెల్యేలకే కాకుండా ప్రతిపక్షాలకు కూడా ఆదర్శంగా ఉండాలే కానీ ప్రజలు కూడా చీదరించుకునేలా ఉంటే ఎవరైనా విమర్శిస్తారని అన్నారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మీకు నోటికొచ్చింది వాగడానికి కాదని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకని గుర్తించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి భాషతీరు మారక పోతే మున్ముందు కార్యకర్తలు, ప్రజలు, నాయకులు, ఇలాంటి భాషలోనే మాట్లాడుకునే దుస్థితి ఏర్పడుతుందని అన్నారు.



