Tuesday, October 14, 2025
E-PAPER
HomeNewsమహిళలను మోసం చేసి రూ.18 కోట్లతో పరారీ

మహిళలను మోసం చేసి రూ.18 కోట్లతో పరారీ

- Advertisement -

– డబ్బులు అడిగితే దాడిచేయించిన కిలేడీ
– తక్కువ ధరకు బంగారం ఇస్తానని మోసం
– ఏపీ ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్లు
– సంగారెడ్డి ఎస్పీని ఆశ్రయించిన బాధితులు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

తక్కువ ధరకు బంగారం ఇస్తానని మహిళలను నమ్మించి రూ.18కోట్లు వసూలు చేయడమే కాకుండా డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దాడులు చేయడంతో బాధితులు సోమవారం జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన విద్య.. ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పేరు చెప్పి.. తక్కువ ధరకు బంగారం, ఇచ్చిన డబ్బుకు రెట్టింపు ఇస్తానంటూ మహిళలకు మాయమాటలు చెప్పి దాదాపు రూ.18 కోట్ల వరకు వసూలు చేసింది. మాజీ ఎమ్మెల్యే నుంచి దాదాపు రూ.2 వేల కోట్లు వస్తున్నాయని, కంటైనర్లు కొనేందుకు డబ్బులు కావాలని వారిని నమ్మించింది. తమ డబ్బులు తమకు ఇవ్వమని బాధితులు డిమాండ్‌ చేయడంతో.. వారిపై తన మనుషులతో దారుణంగా దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయిన ఘటన ఈ నెల 9వ తేదీన వెలుగు చూసింది. తమకు న్యాయం చేయాలంటూ సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయానికి విద్య బాధితులు వచ్చి.. పటాన్‌చెరు పోలీసులు పట్టించుకోవడం లేదని ఎస్పీ పరితోష్‌ పంకజ్‌కి ఫిర్యాదు చేశారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని మోసం చేసిందని, డబ్బులు అడిగితే ఈ నెల 9న ఇంటికి పిలిచి తన అనుచరులతో విద్య దాడి చేయించిందని తెలిపారు. పోలీసులు నిందితులు కొందరిని పట్టుకుని వదిలేశారని బాధితులు ఆరోపించారు. ప్రేమ పేరుతోనూ అనేకమందిని విద్య మోసం చేసినట్టు కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అదే విధంగా ఏపీలోని ఓ ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ పోలీసులు, డాక్టర్లు, వ్యాపారస్తులే లక్ష్యంగా డబ్బులు వసూలు చేసిందని, తమకు న్యాయం చేయాలని ఎస్పీకి బాధితులు మొరపెట్టుకున్నారు. తమ డబ్బులు తిరిగిఇప్పించి న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు.

తిరుపతి, హైదరాబాద్‌లోనూ మోసాలు..

ఏపీలోని తిరుపతి, హైదరబాద్‌లోని వారాసిగూడలో ఉన్నప్పుడు కూడా విద్య మోసాలకు పాల్పడింది. అదే విధంగా చిత్తూరు జిల్లాలోనూ ఇలానే నమ్మించి దాదాపు రూ.10 కోట్ల వరకు కాజేసిందనే ఫిర్యాదులున్నాయి. ఆ తర్వాత తన మకాంను పటాన్‌చెరుకు మార్చింది. బాధితులు బంగారం, డబ్బు గురించి అడిగినప్పుడల్లా రేపు, మాపు అంటూ సమాధానం చెబుతూ వచ్చింది. ఏడాదిన్నరగా పటాన్‌చెరులో ఉంటోంది. డబ్బుల కోసం బాధితులు ఒత్తిడి చేయడంతో ఈ నెల 9వ తేదీన వారిని పటాన్‌చెరులోని తన నివాసానికి పిలిపించిన విద్య, తన భర్త.. అనుచరులతో వారిపై దాడి చేయించారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలవ్వగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -