ముందుగా ‘వంట మనుషులే తినేలా’ ఆదేశాలు: మంత్రి మహ్మద్ అజారుద్దీన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మైనార్టీ గురుకులాల్లో భవిష్యత్తులో ఫుడ్ పాయిజన్ కాకుండా కఠిన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరా బాద్‌లోని ముషీరాబాద్ మైనార్టీ గురుకులంలో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనను స్వల్పమైనదిగా అభివర్ణించిన ఆయన, ఇకముందు అలాంటివి కూడా జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తామని తెలిపారు. మైనార్టీ గురుకులాల్లో వంట మనుషులే, పిల్లలకు భోజనం పెట్టడానికి అరగంట ముందు అదే భోజనాన్ని తినేలా ఆదేశించినట్టు చెప్పారు. అంతే కాకుండా క్రమం తప్పకుండా ఆహార నాణ్యత తనిఖీలు, ఇతర చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మైనార్టీ గురుకులాల్లో కేవలం 40 మాత్రమే ఖాళీలున్నాయనీ, 7 వేల మందికిపైగా బోధన, బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారని చెప్పారు.
వక్ఫ్ ఆస్తుల నమోదుకు 3 నెలల గడువు
ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల నమోదు కోసం వక్ఫ్ ట్రిబ్యునల్ మూడు నెలల గడువు పొడిగించినట్టు మంత్రి అజారుద్దీన్ తెలిపారు. రాష్ట్రవ్యా ప్తంగా 63,180 వక్ఫ్ ఆస్తులను నమోదు చేయాల్సి ఉందని చెప్పారు. ఆస్తుల సంఖ్య ఎక్కువగా ఉండటం, వివరాలను సేకరించడం, పపరిశీలించడం, డిజిటలైజేషన్ కోసం ఈ పొడిగింపును కోరినట్టు తెలిపారు. గడువులోగా అన్ని ఆస్తుల వివరాలను పూర్తి చేయాలని సంబం ధిత అధి కారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీతో పాటు తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థ చైర్మెన్ మహమ్మద్ ఫహీం ఖురేషీ, హజ్ కమిటీ చైర్మెన్ హుస్సైనీ పాషా, మైనార్టీ సంక్షేమ శాఖ సీఈవో షఫీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు.



