Saturday, November 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబాలోత్సవాలు జ్ఞాన వికాస దీపాలు

బాలోత్సవాలు జ్ఞాన వికాస దీపాలు

- Advertisement -

పిల్లల్లో సృజనా పాటవాలకు తోడ్పాటునందించాలి
మార్కులతో కొలువలేం.. మూస వార్షిక పరీక్షలతో జతకట్టలేం : పిల్లల మానసిక నిపుణులు సుధీర్‌ సండ్ర
ఘనంగా ముగిసిన తెలంగాణ బాలోత్సవం
నవతెలంగాణ-ముషీరాబాద్‌

బాలోత్సవాలు జ్ఞాన వికాస దీపాలుగా ఐదు సంవత్సరాలుగా వెలుగునొందుతున్నాయని పిల్లల మానసిక నిపుణులు, కౌన్సిలర్‌ సుధీర్‌ సండ్ర అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో తెలంగాణ బాలోత్సవం 5వ పిల్లల జాతర కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఎన్ని కోట్లు కుమ్మరించినా తిరిగి పొందలేనిది బాల్యమని, అటువంటి పసితనాన్ని పసిడి జ్ఞాపకాలతో ఆటపాటల సృజనకు ఒక సంక్షిప్త నామం తెలంగాణ బాలోత్సవమని చెప్పారు. బాలోత్సవం వేలాది చిన్నారుల స్నేహ సంఘమని, భవిష్యత్‌పై కొత్త ఆశలు మోసుకెళ్తుందని అన్నారు. జాతి భవితకైనా భాష మనుగడకైనా పిల్లలే ఆశా దీపాలు అని తెలిపారు. పిల్లలను మార్కులతో కొలువలేమని, మూస వార్షిక పరీక్షలతో జత కట్టలేమని అన్నారు. కుంచతో అద్భుత విన్యాసాలు చేశారు.. పద్యాలు వల్లె వేశారు.. మట్టితో బొమ్మలు చేశారు.. చిత్తు పేపర్లతో అద్భుతమైన క్రాఫ్ట్‌ బొమ్మలేశారు.. జానపదం మా ప్రాణపదమంటూ ఎగిరి గంతులేశారు.. శాస్త్రీయ నృత్యాలతో పిల్లలు నాట్యమయూరాలుగా మారిపోయారు.. మొత్తంగా పిల్లలను పెద్దలు చూసినప్పుడు మంత్రముగ్ధు లయ్యేలా ప్రదర్శనలన్నీ ఆకట్టుకున్నాయని కొనియా డారు. బాలోత్సవ తరహా వేదికలు మరిన్ని ఆవిర్భవిస్తే ఈ పురిటిగడ్డపై శాస్త్ర విజ్ఞానం వెల్లివిరుస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు, ఎవరికి వారే పిల్లల సృజన పాటవాలకు చేతనైన తోడ్పాటు అందించాలని అన్నారు. అందుకోసం వీధి వీధినా బాలోత్సవాల అవసరం పెరుగుతుందన్నారు. కథలు చెప్పడం వల్ల పిల్లల ఊహాశక్తికి రెక్కలు తొడిగాయన్నారు. బాలోత్సవం దేశ పునాదుల్ని గట్టిపరుస్తుందని చెప్పారు.

బాలోత్సవం భారతీయ కళలను, తెలంగాణ కళల సంస్కృతిని అద్భుతంగా తెలియజేసే ఒక గొప్ప ప్రయత్నమని, మనం ఎట్టా ముందుకు దూసుకెళ్లాలని పిల్లలకు, ఉపాధ్యాయులకు చక్కటి హిత బోధ చేసిందని తెలిపారు. విలువలు లేని విద్య అవసరం లేదని, ప్రయివేటు విద్యాసంస్థలు సైతం నాణ్యమైన విద్యని అందించ లేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్లో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయని, తద్వారా ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విలువలు కలిగిన విద్యను అందించినప్పుడే అవి దేశ ప్రగతికి ఆధారమవుతాయని అన్నారు. ఓడిపోతేనేం అది రేపు గెలుపు కోసమని ఒక భరోసా అని వివరించారు. నేడు 67 శాతం మంది విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడటంతో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయన్నారు. మార్పు రావాలంటే రేపటి తరంలో మార్పు రావాలన్నారు. ఆ మార్పునకు పునాదియే బాలోత్సవం అన్నారు.

తెలంగాణ బాలోత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్లు, ఎన్‌.సోమయ్య మాట్లాడుతూ.. పసిపిల్లల్లో నిగూఢంగా దాగిన సృజనను వెలికి తీసే ఒక ప్రయత్నం ఐందేండ్లుగా జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా కల్చరల్‌ అండ్‌ అకాడమిక్‌గా 18 ఈవెంట్లతో అలరించారన్నారు. కథ, కవిత్వం, ఏకపా త్రాభినయం, దాండియా, జానపద గేయాలపన, జానపద నృత్యం, శాస్త్రీయ నృత్యం, చిత్రలేఖనం, మట్టి బొమ్మలు, వివిధ రకాల శాస్త్రీయ ప్రయోగాలు.. వంటివి విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి బాగా ఉపయోగపడ్డాయన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి భాషా సాంస్కృతిక శాఖ, ఎల్‌ఐసీ, భారత్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, ఎస్‌సీసీఎల్‌, సంస్థల సహకారం అందించాయని తెలిపారు. ప్రారంభోత్సవానికి వచ్చిన కె.వి రమణచారి, సుద్దాల అశోక్‌ తేజ, ఎవరెస్టు శిఖరం అధిరోహించిన మాలావత్‌ పూర్ణిమ, కుట్టి ఓ కుట్టి గ్రంథాలయాలు ఏర్పాటు చేసిన ఆకర్షణ సతీష్‌కు, రెండ్రోజుల కార్యక్రమాలకు జడ్జిలుగా వ్యవహరించి విద్యార్థులకు బహుమతులిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వాలంటీర్స్‌గా సహకరించిన భారత్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఎన్‌సీసీ క్యాడర్‌ ఉపాధ్యాయులు, ఆ రంగాలలో పనిచేస్తున్న పిల్లల సైకాలజిస్టులు, కళాకారులకు, మీడియా మిత్రులకు, పర్మిషన్‌ ఇచ్చి ప్రోత్సహించిన పోలీస్‌, మున్సిపాలిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -