వృత్తిని నిజాయితీగా.. నిబద్ధతతో చేసేవాళ్ళు అనేకం మనకు జీవితంలో తారసపడుతుంటారు. వీటితో పాటు ఆడుతూ పాడుతూ చేసేవాళ్ళు లేకపోలేదు. ఇగో! అటువంటి రచయిత్రి… కవయిత్రి… నాటకకర్త… వ్యాసకర్త… విమర్శకులు… కార్యకర్త… కావ్యకర్త.. సాహితీ సంస్థల బాధ్యులు వెరసి తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల, ఇబ్రహీం పట్నంలో అటు పాఠాలను, ఇటు ఆటపాటలతో పాటు జీవనమూల్యాలను బోధిస్తున్న లెక్చరర్ డాక్టర్ దాసోజు పద్మావతి.
వృత్తి రీత్యా తెలుగు ఉపన్యాసకులు, ప్రవృత్తి రీత్యా బాల సాహిత్యంతో పాటు పద్యం మొదలుకుని బాల గేయం వరకు రాస్తున్న ప్రతిభామూర్తి. పద్మావతి స్వస్థలం నల్లగొండ జిల్లా నార్కాట్ పల్లి, రెవెన్యూశాఖలో ఉన్నతోద్యోగి అయిన తండ్రి బదిలీల రీత్యా మే 8, 1968న నల్లగొండ జిల్లా రాయగిరిలో పుట్టారు. తల్లి తండ్రుల శ్రీమతి దాసోజు వజ్రమ్మ – విశ్వనాథాచారి. నల్లగొండ మొదలు తండ్రి ఉద్యోగం చేసిన ప్రతిచోట చదివిన పద్మావతి సుప్రసిద్ధ కవి కనపర్తి రామచంద్రాచార్యుల కవిత్వంపై ‘కనపర్తి కవిత్వం-సమగ్ర పరిశీలన’ పేర డా.బి.జయరాములు పర్యవేక్షణలో పిహెచ్.డి. పరిశోధన చేసింది.
‘పిల్లలకోడి’ లాగా నిరంతరం మిత్ర, శిష్య సమూహంతో కనిపించే పద్మావతి విద్యార్థి దశలోనే ‘విద్యా ఔన్నత్యం’ నాటిక రాశారు. విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఆకాశవాణి ‘యువవాణి’లో తన గళాన్ని వినిపించారు. వివిధ సందర్భాల్లో ప్రముఖులపైన వ్యాసాలు రాసి రేడియో ద్వారా వినిపించారు. ఉపాధ్యాయినిగా తొలి నుండి విద్యార్థులతో రచనలు చేయించి, తాను కూడా స్వయంగా బాలల కోసం రచనలు చేశారు. పరిశోధకురాలుగా వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని వివిధ అంశాలపై పత్రసమర్పణ చేశారు.
రచయిత్రిగా అనేక ప్రక్రియలు రూపాలలో రచనలు చేసిన పద్మావతి మూడు రచనలను ప్రచురించారు. ‘కవితా సుమాలు’ వీరి కవితా సంపుటి. మరో రెండు రచనలు ‘అమ్మకు ప్రేమతో..’, ‘అఖరార్చన’ లు. తొలి నుండి వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న పద్మావతి డా.కూరెళ్ళ విఠలాచార్య నేతృత్వంలో పురుడుపోసుకున్న ‘మహిళా భారతి’ సంస్థకు అధ్యక్షులు. తెలుగు బోధనాభాషగా ఉండాలన్న సంకల్పంతో జరిగిన, జరుగుతున్న అనేక ఉద్యమాల్లో పద్మావతి మొదటివరుసలో నిలుచుంది. భాష కోసం పరితపించే మేకా రవీంద్ర అంతర్జాలం మొదలుకుని ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో భాగస్వామిగా ‘తెలుగు అభివృద్ధి సమితి’తో కలిసి నడిచారు. తన కళాశాలలో ప్రతి ఉత్సవాన్ని. మహనీయుల జంతులను, పండుగలను నిర్వహించింది.
బాల సాహితీవేత్తగానే కాక బాల వికాసకారిణిగా ఈమెకు ఆకాశవాణి ‘బాలనందం’ తోనూ ప్రత్యక్ష సంబంధం ఉంది. అందులో విద్యార్థులతో తన స్వీయనాటకాలను వేయించడమేకాక క్విజ్ మాస్టర్‌గా వ్యవహరించారు. బాలానందంలో వచ్చిన ‘సంక్రాంతి’ బాలల నాటకం వీరికి పేరుతెచ్చిపెట్టింది. ప్రస్తుత ఉద్యోగంలోనూ విద్యార్థుల కోసం తన కళాశాలలో ‘సృజనాత్మక రచనా కార్యశాలలు’ నిర్వహించింది, విద్యార్థులను రచన వైపు ప్రోత్సహించి ప్రచురణవైపు మళ్ళించారు. వీరి విద్యార్థులు బాల చెలిమి పురస్కారాలతో పాటు ఏకంగా శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి పుస్తక ప్రచురణ నిధికి ఎంపిక కావడం విశేషం. పద్మావతి బాల సాహిత్యంపై ఇటీవల కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి ప్రత్యేక పరిశీలనా రచనను సమర్పించడం మరో గౌరవం. బాలల కోసం కథలు, గేయాలు, నాటికలు, సుద్దులు వంటి రచనలు చేశారు. ‘మమతానురాగాల ముల్లె నాపల్లె/ అమ్మ ఒడిని తలపించె కల్పవల్లి నా పల్లె’ అంటూ పల్లెను అచ్చంగా తన గీతాల్లో ఆవిష్కరిస్తూనే, ‘ప్రతి ఫలం ఆశించని/ ప్రేమ సుమమం/ ఒడుదుడుకుల్లో ఓదార్చే/ అమృత హస్తం’ అంటూ చక్కనైన స్నేహాన్ని గురించి రాశారు ఈమె. నిరంతరం పిల్లలతో.. పిల్లల మధ్య ఉండే అవకాశం ఏ కొందరికో వస్తుంది. ఆ అవకాశాన్ని చక్కగా మలుచుకుంటే ప్రతి క్షణం ఒక ఆనందోకం వెల్లివిరుస్తుంది.
పంతులమ్మగా ఉన్న పద్మ దానిని చక్కగా, అందంగా సద్వినియోగం చేసుకున్నారు. పిల్లతో రాయించింది… పాఠాలు చెప్పింది… తానూ రాశారు. ఇంకోచోట ఇంకో బాల గేయంలో కృష్ణానది గూర్చి చెబుతూ ‘వేయి వీణలు మ్రోగినట్లు/ కోటి కోయిలలు పాడినట్టు/ తెలుగు వైభవ ప్రాభవం/ ఝరీ ప్రవాహమై పాడినట్లు’ అమ్మ ప్రవాహం ఉందట. తల్లితండ్రులను గురించి రాస్తూ ‘కనిపించే దేవుళ్ళు/ కని పెంచిన అమ్మానాన్నలు’ అంటారు. గేయాలే కాక పిల్లల కోసం అనేక నాటికలను బుర్రకథలను కూర్చారు. వీరి కథలు అన్ని మాస, వార, దిన పత్రికల్లో వచ్చాయి. వాటిలో పిల్లల్లో సృజనను పెంచే ‘కాలం మారింది’ కథ ఒకటి. ఇందులో కాకి, నక్కలు పాత్రలు. ఇది ‘బాల చెలిమి’ బాలల పత్రికలో వచ్చింది. పిల్లల్లో దేశభక్తి జాగృతం కోసం రాసిన కథ ‘వీర జవాన్’. బంధాలు, అనుబంధాల నేపథ్యంలో అమ్మమ్మ మనవరాలికి రాసిన లేఖాత్మక రచన ‘ప్రేమలేఖ’. పుస్తకాల విలువను చెప్పే కథ ‘మధుర స్వప్నం’. తనదైన తోవలో తనకున్న ఆలోచనలను రేపటితరానికి వారసులైన పిల్లలకు పంచుతున్న దాసోజు బహుముఖ ప్రతిభాశాలి.. ప్రభావశాలి. బాలల కోసం దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా పనిచేస్తున్నప్పటికీ నిజానికి బాల సాహిత్యంలో తాను చేయాల్సినంత చేయలేదని నా ఆరోపన. అనేకమంది విద్యార్థులకు కవితాక్షరదీపదారుల్ని పరుస్తున్న పద్మావతి ఆగామి కాలంలో మరిన్ని మంచి బాలల రచనలు చేయాలన్నది ఆకాంక్ష. జయహో బాల సాహిత్యం.
డా|| పత్తిపాక మోహన్
9966229548