2025లో 45.47 ట్రిలియన్ యువాన్లు
బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతేడాది చైనా వాణిజ్యంపై అనేక ఆంక్షలు పెట్టడంతో పాటుగా భారీగా టారిఫ్‌లను పెంచినప్పటికీ రికార్డ్ విదేశీ వాణిజ్యాన్ని నమోదు చేసింది. 2025లో చైనా వస్తువుల విదేశీ వాణిజ్యం ఏడాది ప్రాతిపదికన 3.8 శాతం పెరిగి 45.47 ట్రిలియన్ యువాన్లకు (6.51 ట్రిలియన్ డాలర్ల) చేరుకుంది. ఇది సరికొత్త రికార్డును సృష్టించడమే కాకుండా, బలమైన వాణిజ్యానికి నిదర్శనమని చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ వెల్లడించింది. గత ఏడాది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద వస్తువుల వాణిజ్య దేశంగా చైనా తన స్థానాన్ని నిలబెట్టుకుందని పేర్కొంది. 2025లో చైనా ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 6.1 శాతం పెరిగి 26.99 ట్రిలియన్ యువాన్లకు చేరుకోగా, దిగుమతులు 0.5 శాతం పెరిగి 18.48 ట్రిలియన్ యువాన్లుగా నమోదయ్యాయి. ”అంతర్జాతీయ వాతావరణం తీవ్రమైన మార్పులకు లోనవుతూ, ప్రపంచ ఆర్థిక, వాణిజ్య క్రమం ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితుల్లోనూ చైనా విదేశీ వాణిజ్య రంగం సాధించిన విజయాలు అసాధారణమైనవి. ఎంతో కష్టపడి సాధించినవి.” అని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ (జీఏసీ) డిప్యూటీ హెడ్ వాంగ్ జున్ పేర్కొన్నారు. సంక్లిష్టమైన బాహ్య వాతావరణం నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ సాధించిన ఈ విజయాలు.. చైనా విదేశీ వాణిజ్య సంస్థల నాణ్యతలో మెరుగుదలని, ఉత్పత్తుల పోటీతత్వాన్ని, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మారే సామర్థ్యాన్ని పూర్తిగా నిరూపిస్తాయని చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ రీసెర్చ్ ఫెలో బాయి మింగ్ తెలిపారు.
విదేశీ వాణిజ్యంలో చైనా రికార్డ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



