అర్హులైన సినీ కార్మికులకు ఇళ్ళని కేటాయించాలి
చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు 300 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగిందని, సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపిస్తూ పలువురు సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు. నిజమైన సినిమా కార్మికులకు ఇళ్లు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని, ఫ్లాట్లను బ్లాక్ మార్కెట్‌లో కోట్లకు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వల్లభనేని అనిల్ కుమార్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్రపురి పోరాట సమితి, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, ‘కార్మికుల కోసం కేటాయించిన స్థలంలో వారిని మోసం చేసే కుట్ర జరుగుతోంది. చిత్రపురిలో మిగిలిన 2.5 ఎకరాలలో కార్మికులు అడుగుతున్న సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కాదని, 1200 నుండి 4400 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాలు చేపట్టి, వాటిని బయటి వ్యక్తులకు అమ్ముకోవడానికి కమిటీ ప్లాన్ చేసింది. ఇందుకు హెచ్‌ఎండిఎ, సిఎంఓ కార్యాలయ అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్‌పై ఇప్పటికే 15 ఎఫ్‌ఐఆర్‌లు, 10 ఛార్జ్‌షీట్‌లు నమోదయ్యాయి. రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా తన అక్రమాలు ఆపడం లేదు. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రిట్ పిటిషన్ నెం.18225/2021, 7642/2024, 9335/2025 ద్వారా ప్రస్తుత కమిటీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, అధికారులు పట్టించుకోవడం లేదని, దీనివల్లే అనిల్ కుమార్ అవినీతికి అడ్డు లేకుండా పోయింది’ అని తెలిపారు.
ఈ ధర్నా కార్యక్రమంలో చిత్రపురి పోరాట సమితి అధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్, జూనియర్ ఆర్టిస్ట్ సీఐటీయూ నాయకులు సంకూరి రవీందర్, తెలంగాణ పోరాట మేధావి నాయకులు భద్ర, నవోదయం పార్టీ అధ్యక్షులు శివశంకర్ పటేల్, ఆప్ పార్టీ నాయకురాలు హేమ సుదర్శన్, గాదం లలిత, రమేష్ వర్మ, శ్రీను, సి.హెచ్. ప్రకాష్, ఓం ప్రకాష్, గోపాల కష్ణ, మద్దినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రపురిలో రూ.300 కోట్ల భారీ కుంభకోణం
- Advertisement -
- Advertisement -