సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ప్రముఖ విద్యావేత్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు
నవతెలంగాణ – ముషీరాబాద్
తెలంగాణ రైతాంగ సాయుధపోరాట యోధులు, ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త చుక్కా రామయ్యను శనివారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అహర్నిశలు పనిచేసిన వ్యక్తి చుక్కా రామయ్య అని అన్నారు. ఆయన సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
విద్యారంగానికి ఆయన చేసిన సేవలు అపారమైనవవని, ఉన్నతమైన విద్యను గ్రామీణ విద్యార్థులకు చేరవేసేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో స్థిరపడిన ఎంతో మంది యువతకు కారణం చుక్కా రామయ్య అని తెలిపారు. ఆయన విద్యాప్రదాతే కాకుండా తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తన పాత్రను పోషించారని అన్నారు. ఆయన వెంట సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రాంగారెడ్డి, మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.బాబురావు, అరుణజ్యోతి, సరళ, శ్రీరాం నాయక్ తదితరులు ఉన్నారు.



