ప్రభుత్వం దిగిరాకుంటే పోరాటం ఉధృతం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ల ‘నిరవధిక సమ్మె’
నవతెలంగాణ – కరీంనగర్
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సీఐటీయూ పూర్తి మద్దతు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేపట్టారు. కరీంనగర్ సర్కిల్ కార్యాలయం ముందు జరుగుతున్న సమ్మెలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పాల్గొని ప్రసంగించారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కార్మికుల పట్ల ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. వరంగల్ ఎన్పీడీసీఎల్ ముందు వేలాది మందితో మహాధర్నా చేసినా స్పందించకపోవడం ప్రభుత్వ మొండివైఖరికి నిదర్శనమన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ.. ఒకే సంస్థలో రెండు రకాల సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ వివక్ష చూపడం దారుణమన్నారు.
అర్హత కలిగిన కార్మికులకు వెంటనే కన్వర్షన్ ఇవ్వాలని, అన్‌మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జీఓ 11 ప్రకారం పీస్ రేట్, స్పాట్ బిల్లింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చే వరకు సీఐటీయూ అండగా ఉంటుందని, అవసరమైతే ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్లు గూగులోతు శివకృష్ణ, వెల్శెట్టి రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో కంపెనీ కో-కన్వీనర్ అనంతరెడ్డి, ట్రాన్స్ కో రాష్ట్ర వైస్ చైర్మెన్ ఉట్ల ప్రభుదాస్, జిల్లా జాయింట్ సెక్రెటరీ పురుమల్ల సంతోష్, కరీంనగర్ జిల్లా చైర్మెన్ గన్ను నరేందర్ రెడ్డి, కన్వీనర్ కొండ్ర రమేష్, రఘునాథరెడ్డి, కృష్ణ, శ్రీనివాస్ నాయక్, మద్దెల శ్రీనివాస్, వీణ, సుజాత, వేణు, చంద్రశేఖర్, శ్రీకాంత్, అనిల్, హరీష్, మహిపాల్, గంగయ్య, అనిల్ పాల్గొన్నారు.
ఆర్డిజన్ల సమస్యలు పరిష్కరించాలి
ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని, ఏపీఎస్ ఈబీ సర్వీస్ రూల్స్ సవరణతో పాటు వేతన సవరణ చేపట్టాలని కోరుతూ బుధవారం హైదరాబాద్ వీఎస్టీ చౌరస్తాలోని డివిజనల్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులను విద్యార్హతల ప్రాతిపదికన కన్వర్షన్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కిరణ్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సెంట్రల్ సర్కిల్ అధ్యక్షులు వెంకన్న డిమాండ్ చేశారు.



