Monday, December 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిశ్రమజీవుల పతాక సీఐటీయూ

శ్రమజీవుల పతాక సీఐటీయూ

- Advertisement -

మెతుకుసీమగా పేరొందిన మెదక్‌ జిల్లాలో డిసెంబర్‌ 7-9వరకు నిర్వహిస్తున్న సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభలు ఎంతో స్ఫూర్తి దాయకంగా జరుగుతున్నవి. ఈ మహాసభలు ప్రజాపోరాటాలకు, కార్మిక ఉద్యమాలకు తోడ్పడతాయనడంలో ఎలాంటి సందే హం లేదు. అసంఘటిత రంగ కార్మికులు ఎక్కువమంది ఉన్న ఈ ప్రాంతంలో మహాసభలు నిర్వహించుకోవడం ఒక కొత్త అనుభూతి. అయితే ఈ మహాసభల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ఎంతగానో కృషిచేశారు. ఇరవై ఒక్క మండలాల్లో 73 సీఐటీయూ అనుబంధ సంఘాల సహకారంతో పెద్ద ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా 492 గ్రామ పంచాయతీల్లో గ్రామ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. కొత్తగా ఏర్పాటైన సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో చైతన్యవంతమైన కార్మికవర్గం ఉన్నది. కీర్తిశేషులు కామ్రేడ్‌ కేవల్‌ కిషన్‌ సాయుధ పోరాటంలో పాల్గొన్న నాయకుడు. మెదక్‌లో భూమి,భుక్తి, విముక్తి కోసం అనేక ఉద్యమాలను నిర్మించాడు. తన భూమిని కూడా పేదలకు దానం చేసిన మహనీయుడు. సంగారెడ్డిలో పార్టీ కార్యాలయం ఆయన పేరునే ఉన్నది. కరోనా సమయంలో కూడా కేవల్‌ కిషన్‌ భవన్‌లో పేదలకు సేవలందించింది.
పటాన్‌చెరు ఏరియాలోని సాండ్విక్‌ కంపెనీలో సీఐటీయూ నేతలు చుక్క రాములు, సుధాభాస్కర్‌ పోరాటాల భీజాన్ని వేశారు. అది మర్రి ఊడల్లా అనేక కంపెనీలకు, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. వీఆర్‌ఏ, అంగన్‌వాడీ, ఆశా, హమాలీల యూనియన్‌ల విస్తరణ పెరిగింది. పటాన్‌చెరు, ఐడిఏబొల్లారం, పాశమైలారంలలో ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ పనిచేసే వారిలో చాలామంది సీఐటీయూలో సభ్యులుగా ఉన్నారు. సంగారెడ్డిలో గతేడాది ఇదే సమయంలో జరిగిన సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడంలో వారిదే కీలకపాత్ర.వారి వేతనాల నుంచి కూడా అనేకమంది విరాళాలందజేసి మహాసభలో నిర్వహణకు సహకారమందించారు. హక్కులను కాపాడుకోవడంలో, సమస్యల్ని పరిష్కరించుకోవడం, మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో చేసే పోరాటంలో సీఐటీయూ వారి వెన్నంటే ఉంది. అందుకే అక్కడ అనేకరంగాల్లో యూనియన్‌ బలోపేతంగా ఉంది. సిద్దిపేటలో కూడా గతంలో సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలు విజయవంతంగా నిర్వహించారు. అయితే ఈ ప్రాంతంలోని మల్లన్నసాగర్‌ భూములు కోల్పోయిన రైతాంగానికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం అందించాలంటూ సీఐటీయూ అనుబంధ రైతుసంఘం చేసిన పోరాటాలు మరచిపోని ఘట్టాలు. నాటి ఉద్యమపోరులో ఉమ్మడి మెదక్‌ జిల్లా సీఐటీయూ కార్యదర్శి ఏ మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు గొడ్డుబర్ల భాస్కర్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయరాజు జైలు జీవితాన్ని గడిపారు. అప్పటి ప్రభుత్వం ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టినా వాటిని అధిగ మిస్తూ రైతులకోసం చేసిన పోరాటాలు నిజంగా అభినందనీయం. భూ నిర్వాసితుల గ్రామాల్లో అప్పటి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు కూడా వారం రోజులపాటు పాదయాత్ర చేశారు. ఇది ఎంతోమందికి ఉత్తేజాన్ని కలిగించింది. పోరాటాలకు రూపకల్పన చేసింది.

యువత ఎక్కువగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గంలో వారి ఉపాధి రూపకల్పన చేసింది. నిరుద్యోగ సమస్యలపై సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు సీఐటీయూ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్యాంపెయిన్‌ కూడా నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రైెతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోలేదు. సరికదా, పరిహారం ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు. తక్షణ సహాయంగా గజ్వేల్‌ ప్రాంతంలోని వంద కుటుంబాలకు సీఐటీయూ, రైతు సంఘం ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున పంపిణీ చేసింది. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా టీ(బీ)ఆర్‌ఎస్‌ను ఇది ఇరకాటంలో పెట్టింది. తర్వాత కాలంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు పరిహారాన్ని ప్రకటించాల్సి వచ్చింది.ఈ మధ్యకాలంలో పాషా మైలారంలోని కంపెనీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కూడా రూ.5వేల చొప్పున అందించి వారి స్వగ్రామాలైన ఇతర రాష్ట్రాలకు పంపింది. అంతేకాదు ప్రమాద సమయంలో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించడం నుంచి వారి వివరాలు సేకరించి బంధువులకు ఫోన్లు చేసి రప్పించేవరకు అనేక రకాలుగా సాయపడింది. యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, పరిహారాహానికై ఆందోళనలు, నిరసనలు చేపట్టింది. ఇలా నిత్యం కార్మికుల వెంటే ఉంటూ వారి యోగక్షేమాలు, వారి కుటుంబ సంక్షేమం కోసం పోరాడుతున్న యూనియన్‌ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది సీఐటీయూనే. నేడు కేంద్రంలోని మోడీ సర్కార్‌ తెస్తున్న సంస్కరణలతో కార్మికుల హక్కులు పతనమవుతు న్నాయి. పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలు రద్దయ్యాయి. వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లు అమలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికవర్గం మరిన్ని పోరాటాలకు సిద్ధపడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులను ఎండగట్టాలి. సీఐటీయూ 18వ అఖిలభారత మహాసభలు విశాఖపట్టణంలో ఈ నెల చివరన జరగనున్నాయి. ఈ మహాసభల్ని కూడా కార్మికవర్గం జయప్రదం చేయాలి.

అరవింద్‌
9533687400

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -