Wednesday, July 30, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసిగాచి బాధితులకు సీఐటీయూ చేయూత

సిగాచి బాధితులకు సీఐటీయూ చేయూత

- Advertisement -

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచి కెమికల్‌ పరిశ్రమలో 2025 జూన్‌ 30న జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 54 మంది చనిపోయారు. కార్మికుల శవాలు వంద మీటర్ల పైకి ఎగిరిపడ్డాయి. ఒక కార్మికుడి శవం పక్క కంపెనీ మీదకు దూసుకెళ్లింది. వాసన రావడంతో చూస్తే కుళ్లిపోయిన స్థితిలో శవం లభించింది. ఇంకా ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. శిథిóలాలు తొలగించేకొద్ది గుట్టలు గుట్టలుగా కాలిపోయిన కార్మికుల శవాలు గుర్తుపట్టలేని స్థితిలో మాంసం ముద్దలుగా బయటపడ్డాయి. డిఎన్‌ఏ పరీక్ష ద్వారా శవాలను గుర్తుపట్టే పరిస్థితి నెలకొంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, హైడ్రా, రెవెన్యూ, పోలీస్‌, ఫైర్‌ బృందాలు పది రోజులుగా శ్రమించి శవాలను వెలికితీశారు. ఆచూకీ దొరకని ఎనిమిది మంది కార్మికులు కాలి బూడిదై మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల్లో బీహార్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల కార్మికులున్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన హై లెవెల్‌ కమిటీ నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీలు పర్యటించాయి. ముఖ్యమంత్రి ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ.కోటి, క్షతగాత్రులకు రూ.10లక్షలు యాజమాన్యంతో ఇప్పిస్తామని ప్రకటించారు.
కానీ, ప్రమాదం జరిగి నేటికి నెలరోజులవుతోంది. మరికొంతమంది కార్మికులు కాలిన గాయాలతో వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు యాజమాన్యంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఘటన జరిగినప్పటినుంచి సీఐటీయూ బాధిత కుటుంబాలను అంటిపెట్టుకుని ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కేంద్రం నుండి కా|| ఎ.మానిక్‌, కా||కె.రాజయ్య వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులను కలిసి వివరాలు సేకరించారు. రాష్ట్ర అధ్యక్షులు కా|| చుక్క రాములు, సీనియర్‌ నాయకులు కా|| ఎస్‌.వీరయ్య ఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధితుల్ని పరమార్శించారు. అధికారులను సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రెండో రోజు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కా|| జాన్‌వెస్లీ ప్రమాదస్థలాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్‌తో సహా యక చర్యలపై చర్చించారు. ఈ ఘటనలో మృతిచెందిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయలు, క్షతగాత్రులకు 50లక్షలు తక్షణమే ఇవ్వాలని, గాయపడిన కార్మికులకు మెరుగైన కార్పోరేట్‌ వైద్యం అందించాలని, ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అక్కడికి వచ్చిన రాష్ట్ర మంత్రులను యూనియన్‌ నాయకులు నిలదీశారు. కార్మికుల వివరాలను వెల్లడించాలని బాధిత కుటుంబ సభ్యుల కోసం టోల్‌ఫ్రీ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయడంతో ఇద్దరు తహశీల్దార్లను నియమించారు. ఘటన జరిగిన రోజు సాయంత్రానికి 143 మంది కార్మికులు డ్యూటీలో ఉన్నారని వివరాలు వెల్లడించారు.
యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత వైఖరిపై సీఐటీయూ అనేక పద్ధతుల్లో పోరాడింది. అంతేకాదు, ఆచూకీ దొరకకుండా సహాయక కేంద్రంలో ఉన్న పదకొండు మంది కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున సీఐటీయూ అనుబంధ యూనియన్లు సాండ్విక్‌, సిబిఎల్‌, తోషిబా, కిర్బిల నుండి రాష్ట్ర అధ్యక్షులు కా||చుక్క రాములు ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు డెడ్‌బాడీలను గుర్తించి అందించే దగ్గర, డిఎన్‌ఏ టెస్టులు ఇచ్చే దగ్గర సహాయంగా నిలిచారు భాదితుల సెల్‌నెంబర్స్‌ సేకరించి వారి కుటుంబ సభ్యులు రాలేని పరిస్థితుల్లో ఉంటే అధికారులతో మాట్లాడి ఫోన్‌పే ద్వారా ప్రయాణ ఖర్చులు ఇప్పించారు. తక్షణ సహాయం రూ.10వేలు అందించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎస్‌.రమ, ఏఐటియూసి, ఐఎఫ్‌టియు, టియుఎస్‌యూటి, బిఆర్‌కె, టిఎన్‌టియుసి సంఘాల రాష్ట్ర నాయకులు సందర్శించి బాధిత కుటుంబాలను పరమార్శించారు. సీఐటీయూ జాతీయ కార్యదర్శి కా| సుదీప్‌దత్త, రాష్ట్ర కార్యదర్శి కా||శ్రీకాంత్‌ పర్యటనలో బెంగాల్‌ బాధిత కుటుంబాలను కలిశారు. పార్టీగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు వందమందితో ధర్నా నిర్వహించింది. పదివేల కరపత్రాలు పంపిణీ చేసింది. రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ హాజరయ్యారు. పటాన్‌చెరులో నిరసన ర్యాలీ, జిల్లావ్యాప్తంగా ఆందోళనలు పెద్దఎత్తున నిర్వహించారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడే సీఐటీయూ, వారికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా అంతేవేగంగా స్పందిస్తుందని సిగాచి ఘటన ద్వారా అన్నివర్గాల ప్రజ లకు తెలిసింది. ఇతర పరిశ్రమల్లో కూడా ప్రమాదం జరిగిన తీరు, కార్మిక సంఘంగా వారిని అక్కున చేర్చుకున్న అంశాల్ని చర్చించుకోవడం మంచి పరిణామం. పార్టీలకతీతంగా నాయకులు స్పందించడమే కాదు, సీఐటీయూ కృషిని పొగిడారు. అదే జులై 9న దేశవ్యాప్త సమ్మెలో కూడా మంచి ఫలితాలనిచ్చింది.
– అతిమేల మానిక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -