Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యా విధానంపై స్పష్టతనివ్వాలి

విద్యా విధానంపై స్పష్టతనివ్వాలి

- Advertisement -

కె.కేశవరావుతో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

విద్యా విధానంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కోరింది. ఈ మేరకు గురువారం ఆ కమిటీ అధ్యక్షులు కె.చక్రధరరావు, ప్రధాన కార్యదర్శి జి.హరగోపాల్‌, కార్యనిర్వాహక కార్యదర్శి కె.లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నత స్థాయి విద్యా కమిటీ చైర్మెన్‌ కె.కేశవరావుతో సమావేశమయ్యారు. నూతన జాతీయ విద్యా విధానం -2020, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ అంశాలు చర్చకు పెట్టి ప్రభుత్వం ప్రజలను గందరగోళ పరుస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు విద్యారంగ బలోపేతంతో సామాన్యులు ఫీజుల భారంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ”ప్రజలందరికి మేలు జరిగేలా అన్ని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలి. విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్‌ కేటాయించాలి. పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలి.

ఉపాధ్యాయులను విద్యేతర కార్యక్రమాల నిర్వహణ నుంచి మినహాయించాలి. ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలను నియంత్రించాలి. వాటిపై పర్యవేక్షణ కొనసాగించాలి. విద్యారంగంలో కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయరాదు. తెలంగాణలో యు.కె ప్రయివేటు పాఠశాలలకు అనుమతించకూడదు. నూతన జాతీయ విద్యా విధానం -2020 ప్రతిపాదించిన నాలుగు సంవత్సరాల డిగ్రీ విధానాన్ని అమలు చేయకూడదు. రాష్ట్రంలోని ప్రతి విశ్వవిద్యాలయానికి కనీసం రూ.100 కోట్ల బడ్జెట్‌ కేటాయించాలి. కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌కు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్కేల్స్‌ అమలు చేయాలి. విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న టీచింగ్‌ నాన్‌-టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలి….. ” అని వారు సూచించారు. కె.కేశవరావు ఆ సూచనల పట్ల సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్‌ అధ్యక్షులు సిహెచ్‌ అనిల్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్‌, డీటీఎఫ్‌ అధ్యక్షులు ఏం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, ట్రీటా నుంచి కె.రవిచంద్ర, కె.వేణుగోపాల్‌, వై.అశోక్‌ కుమార్‌, రామకృష్ణ, సుబ్బారావు, ఎం.ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -