ఆన్వి కనోడియా… ఈ టీనేజ్ అయ్మాయి ఋతు గౌరవాన్ని పునర్నిర్వచించుకుంటుంది. కేవలం పదిహేనేండ్ల వయసులో గ్రామీణ మహిళలకు పరిశుభ్రమైన ఋతు ఉత్పత్తులు, ఉపాధిని అందించడానికి ఫ్లో ప్యాడ్‌లను ప్రారంభించింది. నేడు ఇది భారతదేశం అంతటా 80,000 కంటే ఎక్కువ పునర్వినియోగ ప్యాడ్‌లను పంపిణీ చేసింది. ఈ చొరవ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని మరింత విస్తరింపచేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న ఆమెకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం…
2020లో కరోనా కారణంగా ప్రపంచమంతా ఆగిపోయింది. అయితే 15 ఏండ్ల వయసులో, గురుగ్రామ్‌లోని సన్షిల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న బాగియా అనే పాఠశాలలో బోధిస్తున్న ఆన్వి కనోడియా కోసం ఏదో కొత్త ఆలోచన వేచి వుంది. ‘కొంతమంది అమ్మాయిలు ఒక నిర్దిష్ట సమయంలో పాఠశాల మానేయడాన్ని గమనించాను. కొంతకాలంగా నేను అదే తరగతి విద్యార్థులకు బోధిస్తున్నాను’ అని ఆమె గుర్తుచేసుకుంది. పాఠశాలకు ఎందుకు రాలేదని అడిగినప్పుడు సన్షిల్ ఫౌండేషన్, పాఠశాల వ్యవస్థాపకురాలు శిల్పా సోనాల్ ‘అమ్మాయిలు వారి పీరియడ్స్ ప్రారంభమైనందున రాలేకపోయారు’ అని చెప్పారు. ఆ సమయంలో పాఠశాలకు వచ్చేందుకు వారికి అనుమతి లేదు. దీనికి సాంస్కృతిక నిషేధాల నుండి ఋతు ఉత్పత్తుల లభ్యత లేకపోవడం వరకు అనేక కారణాలు ఉన్నాయి.
ఏదైనా చేయాలని…
‘కారణం తెలుసుకున్నప్పుడు అది నన్ను చాలా ప్రభావితం చేసింది. అలాగే కరోనా ప్రారంభమైనప్పుడు ప్రజలు తమ ఆర్థిక పరిస్థితి వల్ల ఋతుక్రమ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ఎంత కష్టమైందనే విషయంపై ఒక కథనాన్ని చదివాను. అప్పుడే నేను దీని గురించి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. అలా ఆమె 2020లో సంశిల్ ఫౌండేషన్‌తో కలిసి ఫ్లో ప్యాడ్‌లను ప్రారంభించింది. నేడు ఆమె ప్రయత్నం ఋతుక్రమ పేదరికాన్ని పరిష్కరించడానికి, ఋతు పరిశుభ్రతను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా విస్తరించింది.
సానుభూతి, పరిశోధనతో
ఫౌండేషన్ సహకారంతో కనోడియా పరిష్కారాలను అన్వేషించడం ప్రారంభించింది. అయితే కొత్త పనులు ప్రారంభించాలనుకున్నప్పుడు ఎవరికైనా మార్గం అంత సజావుగా ఉండదు. ‘ఋతుక్రమ ఉత్పత్తుల లభ్యత కోసం ఏదైనా చేయాలని నాకు తెలుసు. కానీ ప్రజలు ఏ ఋతుక్రమ ఉత్పత్తులను సౌకర్యవంతంగా భావిస్తారో నాకు తెలియదు’ అంటూ పంచుకున్నారు. రేషన్ పంపిణీ కోసం వచ్చిన 15 మంది మహిళలను, బాగియా విద్యార్థుల తల్లులను కలిసి ఆమె ఒక నమూనా సర్వే నిర్వహించింది. సెషన్ భాగంగా వారికి ఆమె వారికి ఋతుక్రమ ప్యాంటీలు, డిస్పోజబుల్ ప్యాడ్‌లు, ఋతు కప్పులు, టాంపూన్లు చూపించింది. ‘ఇవన్నీ వారికి కొత్తగా ఉన్నా డిస్పోజబుల్, క్లాత్ ప్యాడ్‌లు వారికి సౌకర్యవంతంగా ఉన్నాయని చెప్పారు. వారిలో ఎక్కువ మంది మొదటి నుండి ఒక క్లాత్‌ను ఉపయోగించేవారు’ అని ఆమె చెప్పింది. క్లాత్ ప్యాడ్‌లు పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందులో సుమారు 5-7 నమూనాలను రూపొందించి మహిళలకు ఇచ్చి అభిప్రాయాలు సేకరించారు. క్లాత్ చూసేందుకు ప్యాడ్‌లా ఉండడంతో వాటిని ఎండలో ఆరబెట్టడానికి వారికి అసౌకర్యంగా ఉందని కొందరు, అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేయడం సులభంగా వుందని మరికొందరు తమ అభిప్రాయాలు చెప్పారు.
ఫాబ్రిక్ వ్యర్థాలతో ప్యాడ్లు
ఫ్లో ప్యాడ్స్ ప్రస్తుతం హర్యానా, ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రెండుసార్లు డ్రైవ్‌లు నిర్వహిస్తుంది. నెలకు సగటున 100 శానిటరీ ప్యాడ్ కిట్‌లను పంపిణీ చేస్తుంది. ప్రతి కిట్‌లో రెండు నుండి మూడు క్లాత్ ప్యాడ్‌లు (రెండేండ్ల వరకు ఉపయోగించవచ్చు), ఒక ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్, ప్యాడ్‌లను ఎలా శుభ్రం చేయాలో చిత్రాలతో కూడిన గైడ్‌లు ఉంటాయి. ఒక కిట్ ఉత్పత్తి ఖర్చు రూ.150. ఇప్పటివరకు 25,000 కిట్‌లను పంపిణీ చేశారు. వాటిలో 80,000 ప్యాడ్‌లు ఉన్నాయి. ఈ ఫ్లో ప్యాడ్‌లు గురుగ్రామ్‌లోని మానేసర్‌లోని పారిశ్రామిక యూనిట్ల నుండి ఫాబ్రిక్ వ్యర్థాలను సేకరించి ఉత్పత్తి చేయబడుతున్నాయి. ”మేము ఈ ఫాబ్రిక్‌ను కట్ చేసి కుట్టేందుకు మహిళలకు ఇచ్చాము’ అని కనోడియా చెప్పింది.
మరింత విస్తరించేందుకు
ప్యాడ్‌లను పంపిణీ చేయడానికి ముందు భద్రత కోసం వారు ప్రయోగశాలలో పరీక్షించారు. కనోడియా, ఆమె తల్లి సోనాల్‌తో ప్రారంభమైన ఈ చొరవ ఇప్పుడు 20 మంది క్రియాశీల స్వచ్ఛంద సేవకుల బృందంగా ఎదిగింది. ‘నేను ఇచ్చే శిక్షణ ఆన్‌లైన్‌లో ఉంటుంది. దాని గురించి నా స్నేహితులకు చెప్పాను. వారందరూ చాలా మద్దతు ఇచ్చారు. అయితే వాస్తవానికి నేను ఈ పనిని ప్రారంభించే వరకు దాని లోతు ఎవరికీ అర్థం కాలేదు’ అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్‌లో చదువుతున్న 20 ఏండ్ల కనోడియా తన చొరవను మరింత విస్తరింప చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ‘నేను ఫ్లో ప్యాడ్‌ల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నాను. వీటిని మరిన్ని నగరాలకు విస్తరించేలా చేయాలి’ అంటుంది.
కేవలం ఒక ఉత్పత్తి కాదు
పంపిణీకి మించి ఫ్లో ప్యాడ్‌లు ఋతు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఎన్‌జీఓల సహకారం తీసుకుంటున్నారు. దీనిపై ఉన్న అపోహలను ఎదుర్కోవడానికి సోషల్ మీడియాను చురుకుగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రయాణం కనోడియాలో కూడా చాలా పరివర్తన కలిగించింది. ‘నేను మొదటి నుండి చాలా మోహమాటస్తురాలిని. దీన్ని ప్రారంభించడానికి ముందు చాలా ఇబ్బంది పడ్డాను. అయితే మనం ఎదైనా చేయాలనుకున్నప్పుడు, లక్ష్యం చేరాలనుకున్నప్పుడు ముందు మనలో మార్పు రావడం చాలా అవసరం. ఇప్పుడు ఫ్లో ప్యాడ్ నా బిడ్డ లాంటిది. దానిపై నాకు అమితమైన ప్రేమ ఉంది. నా పని నిజంగా సంతృప్తికరంగా ఉంది. సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలని మీరు భావిస్తే అది మిమ్మల్ని కూడా మారుస్తుంది’ అంటూ ఆమె తన మాటలు ముగించింది.
మహిళలను సాధికారత ముఖ్యం
మహిళల అవసరాలకు అనుగుణంగా కనోడియా తన డిజైన్‌ను సవరించి, గురుగ్రామ్‌లోని ఝర్సా గ్రామంలోని సంషిల్ కుట్టు యూనిట్‌లో వాటిని ఉత్పత్తి చేసింది. అక్కడి మహిళలకు వాటిని తయారు చేయడానికి శిక్షణ ఇప్పించింది. ‘కరోనాతో వారికి ఎటువంటి ఉపాధి లేదు. అందుకే మేము వారికి ఈ పని అప్పగించాము’ అని ఆమె చెప్పింది. గతంలో బ్యాగులు వంటి చిన్న వస్తువులను కుట్టిన వారికి ఇప్పుడు స్థిరమైన ఆదాయ వనరు లభించింది. ‘వీటిని కుట్టడం వల్ల తమకూ నెలవారీ రుతుక్రమం సాధారణమైందని ఈ మహిళలు మాకు చెప్పారు. ఈ ఆదాయం తన కొడుకు చదువు కోసం ఉపయోగిస్తానని కూడా ఈ మహిళల్లో ఒకరు చెప్పారు’ అని కనోడియా గర్వంగా పంచుకున్నారు.