నవతెలంగాణ -హైదరాబాద్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే త్రివేణి సంగమం వద్ద ఈ పుష్కర వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుష్కరాల్లో పాల్గొన్నారు.
గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు పవిత్ర త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్టించిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని, భక్తుల సౌకర్యార్థం నిర్మించిన 86 గదుల నూతన వసతి సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బృహస్పతి (గురువు) మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. బుధవారం రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించి పుష్కర కాలం ఆరంభమైనప్పటికీ, కాళేశ్వరం ఆలయ అర్చకుల సూచన మేరకు గురువారం సూర్యోదయం నుంచి భక్తులు పుష్కర స్నానాలు ఆచరించడం మొదలుపెట్టారు. గురువారం వేకువజామున 5.44 గంటలకు శ్రీగురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి సరస్వతి ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగుతాయి.పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం 6.45 గంటల నుంచి 7.35 గంటల వరకు సరస్వతి ఘాట్ వద్ద సరస్వతి నవరత్న మాల హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో పాటు వివిధ కళా, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. భక్తుల వసతి కోసం రుసుము చెల్లించి బస చేసేందుకు వీలుగా తాత్కాలిక టెంట్ సిటీని కూడా నిర్మించారు.
పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో భక్తులకు తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, స్నానఘట్టాల నిర్మాణం, రహదారుల మరమ్మతులు, వాహనాల పార్కింగ్ వంటి విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. పుష్కరాల సమయంలో ప్రతిరోజూ సగటున లక్షన్నర మంది భక్తులు వస్తారని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES