రూ.10 కోట్లతో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు
పెంచిన టిక్కెట్ ధరల్లో 20 శాతం బోర్డులో డిపాజిట్
కార్మిక భవనానికి ప్రభుత్వ భూమి
వారి పిల్లలకు కేజీ నుంచి ప్లస్ టూ వరకు ఉచిత విద్య
స్టంట్ మాస్టర్ల రిహార్సల్స్ కోసం ఫ్యూచర్ సిటీలో భూమి కేటాయింపు…సొంతిండ్ల కేటాయింపుపై అధ్యయనం
డిసెంబర్ 9 నాటికి అన్ని అంశాలపై తుది నిర్ణయం
సినీ కార్మికుల అభినందన సభలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సినీ కార్మికులపై సీఎం ఏ రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. డిసెంబర్ 9 నాటికి వారి సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. సినీ కార్మికుల కోసం రూ.10 కోట్లతో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామనీ, కొత్త సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచమని నిర్మాతలు ప్రభుత్వం వద్దకు వస్తుంటారనీ, అలా పెంచిన టిక్కెట్ రేట్లలో నుంచి 20 శాతం సొమ్మును వెల్ఫేర్ బోర్డులో డిపాజిట్ చేసేలా ఆదేశాలు ఇస్తామన్నారు. సినీ కార్మికులు కూర్చుని మాట్లాడుకోవడానికి అవసరమైన భవన నిర్మాణం కోసం ఇక్కడికి సమీపంలోనే ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కృష్ణానగర్ సహా చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న వారి పిల్లలకు ఉన్నతమైన ఉచిత విద్యను కేజీ నుంచి ప్లస్ టూ వరకు ప్రభుత్వమే అందిస్తుందనీ, దీనికోసం త్వరలో స్కూల్ భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు.
ఆ స్కూల్‌లోని పిల్లలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. స్టంట్ మాస్టర్ల రిహార్సల్స్ కోసం భూమి కావాలని కోరారనీ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో దానికి అవసరమైన భూమిని కేటాయిస్తామని స్పష్టం చేశారు. సినీ కార్మికుల ఆరోగ్య భద్రతను ఆరోగ్యశ్రీ ద్వారా పరిరక్షిస్తామన్నారు. సినీ కార్మికులకు సొంతిళ్ల ఏర్పాటుపై అధ్యయనం చేసి, కచ్చితంగా సానూకూల నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. నవంబర్ నెలఖరులోపే సినీ కార్మిక సంఘాల నేతలతో మరోసారి భేటీ అయ్యి, అన్ని విషయాలపై చర్చించి, డిసెంబర్ 9 వతేదీ ఆ నిర్ణయాలపై ఉత్తర్వులు జారీచేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారంనాడిక్కడి యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు.
తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారనీ, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్ కృష్ణ వంటి వాళ్లతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపి, సినీ పరిశ్రమను ఇక్కడకు తరలించారని తెలిపారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం అనాటి మేటి నటులు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి మణికొండలో తన పది ఎకరాల సొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చారని గుర్తుచేశారు. ఆ తర్వాతే సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ ఏర్పాటైందని వివరించారు. చిత్ర పరిశ్రమలో కళాకారులు రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారనీ, వారి శ్రమ, కష్టం తనకు తెలుసన్నారు. తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లడం వెనుక సినీ కార్మికుల కష్టం ఉందన్నారు.
గడచిన పదేండ్లుగా నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ అవార్డులను అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలనీ, తెలంగాణ రైజింగ్-2047 ప్రణాళికలో తప్పకుండా సినీ రంగానికి ప్రత్యేక చాప్టర్ ఉంటుందని చెప్పారు. ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. హాలీవుడ్‌ను తెలంగాణకు రప్పించే బాధ్యత తానే తీసుకుంటాననీ, ఆ స్థాయిలో తనకు సినీ కార్మికుల సహకారం కావాలని కోరారు. అనంతరం సినీ కార్మిక సంఘాలు సీఎం రేవంత్‌రెడ్డిని ఘనంగా సన్మానించాయి. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ దిల్‌రాజు, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



