ఓయూ చరిత్రలో చీకటిరోజు : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్క్ ‘దోపిడీ పాలన’లో విద్యా వ్యవస్థ కుప్పకూలిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బంకర్ బెడ్ల కొనుగోలులో రూ.వంద కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) చరిత్రలో చీకటిరోజని చెప్పారు. గతనెల 25న ఐఏండ్ల లా కోర్సు పరీక్షకు, 27న మూడేండ్ల లా కోర్సు (ఆనర్స్) పరీక్షకు ఒకే ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి అధికారులు బరితెగించారని విమర్శించారు.
సిలబస్ అంశాలు దగ్గరగా ఉన్నప్పటికీ, రెండు వేర్వేరు కోర్సులకు ఒకే ప్రశ్నాపత్రం ఇవ్వడం విద్యార్థుల మేధస్సును అవమానించడమేనని అన్నారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. కనీసం ఒక ప్రశ్నాపత్రాన్ని కూడా సరిగ్గా తయారు చేయలేని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం పాలిస్తుందని నిలదీశారు. తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక తప్పుల తడకగా ఉందన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలిచే గురుకులాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను రద్దు చేయాలని సిఫారసు చేయడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో సామాన్యుల ఇండ్లను కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా అరాచకాలను ఆపి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
కుప్పకూలిన విద్యావ్యవస్థ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



