– ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎరువుల గిడ్డంగి పరిశీలన
– ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలి
– జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగిని ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసిన ఆయన హాజరు పట్టిక ప్రకారం వైద్యాధికారి, సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదా అని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి మెడికల్ ఆఫీసర్ నరసింహ స్వామిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల ఔషధాలు సరిపడా అందుబాటులో ఉండాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాలలో విరివిరిగా ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని సూచించారు. పదమే ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు.
46 ప్రసవాలు జరగగా 40 ప్రైవేటు ఆసుపత్రిలోనే జరిగినట్లు సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గర్భిణీల నమోదు ఆలస్యం అవడం పట్ల ఆయన వైద్యాధికారిని ప్రశ్నించారు. చిన్నారులకు అందించే వ్యాక్సిన్ వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, ఎవరైనా చిన్నారికి వ్యాక్సిన్ వేయకపోతే మళ్లీ వారం పిలిపించి వేయాలని సూచించారు. ల్యాబ్ టెస్టుల రిపోర్టుల గురించి ల్యాబ్ టెక్నీషియన్ పాపయ్య ను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ లో రిపోర్టుల వివరాల నమోదును ఆయన పరిశీలించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని సిబ్బందికి సూచించారు.
ఎరువుల గోదాం పరిశీలన….
మండల కేంద్రంలో సింగిల్ విండో ఎరువుల గోదామును కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. గోదాంలో ఉన్న ఎరువుల నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టి పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. గోదాంలో నిల్వ ఉన్న ఎరువుల వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని విండో కార్యదర్శి శంకర్ ను ఆదేశించారు.