Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపెట్టుబడులతో తెలంగాణాకు రండి

పెట్టుబడులతో తెలంగాణాకు రండి

- Advertisement -

తిరుపూరు పారిశ్రామిక వేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో దుస్తుల (అప్పెరల్‌) పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాల్సిందిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమిళనాడులోని తిరుపూరు దుస్తుల తయారీ పరిశ్రమల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వస్త్ర పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రపంచస్థాయి మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూరులను మంత్రి సందర్శించారు. అతిపెద్ద అప్పెరల్‌ తయారీ కేంద్రంగా తిరుపూరు గ్లోబల్‌ లీడర్‌గా ఎదిగిందనిఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. 10వేల దుస్తుల పరిశ్రమలతో ‘నిట్‌ వేర్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా తిరుపూరు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని ప్రశంసించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు క్యాజువల్‌ వేర్‌, స్పోర్ట్స్‌ వేర్‌, సాక్సులు, టోపీల లాంటి కాటన్‌ ఉత్పత్తుల(90శాతం)ను తిరుపూరు ఎగుమతి చేస్తోందని గుర్తు చేశారు. నాణ్యతతో కూడిన రెడీమేడ్స్‌ తయారీకి అవసరమయ్యే లాంగ్‌ స్టేపుల్‌ (పొడవు పోగుల) కాటన్‌ తెలంగాణాలో సమృద్ధిగా అందుబాటులో ఉందని చెప్పారు. వ్యవసాయ, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసే రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరు కావాల్సిందిగా వారిని కోరారు. త్వరలో దీనికి సంబంధించిన సమాచారం అందజేస్తామని తెలిపారు. అందరితో చర్చించిన తర్వాత తెలంగాణ నూతన టెక్స్‌ టైల్స్‌ పాలసీని రూపొందిస్తామని వెల్లడించారు. అమెరికా విధించిన 50 శాతం సుంకాల నేపథ్యంలో ఎగుమతులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ సమయంలో వస్త్ర పరిశ్రమ చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన హీరో ఫ్యాషన్‌ గ్రూప్‌ (రామ్‌ రాజ్‌ కాటన్స్‌) చైర్మెన్‌ కెఆర్‌ నాగరాజన్‌, ఎండీ సుందరమూర్తిని కలిశారు. సౌత్‌ ఇండియా మిల్స్‌ అసోసియేషన్‌ (సిమా) సెక్రటరీ జనరల్‌ కె. సెల్వరాజ్‌, సంస్థ సభ్యులను తెలంగాణాలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. సులభతర పారిశ్రామిక విధానాల అమలుతో తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఈ సందర్భంగా వారికి వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad