Friday, March 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఏడెన్‌ జలసంధికి పోరు విస్తరణ !

ఏడెన్‌ జలసంధికి పోరు విస్తరణ !

- Advertisement -

అమెరికా-ఇజ్రాయిల్‌ ప్రారంభించిన ఏకపక్ష దాడులు, వాటికి ఇరాన్‌ ప్రతిఘటన నేటితో 28వ రోజులో ప్రవేశించింది. ట్రంప్‌ ముందే చెప్పినట్లు నాలుగు లేదా ఐదు వారాలు దాడులు కొనసాగించటం, సాధ్యమైన మేరకు ఇరాన్‌కు నష్టం కలిగించే దుష్ట ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నిదాడులు చేసినా ఇరాన్‌ తగ్గటం లేదు. అనూహ్యరీతిలో ఎదురుదాడులు చేస్తోంది. దాంతో దిక్కుతోచక ఓటమిని అంగీకరిస్తూ తమతో ఒప్పందానికి రావాలని, లేకపోతే చివరిగా భీకరదాడులు చేస్తామని ట్రంప్‌ యంత్రాంగం బెదిరింపులకు దిగుతోంది. తమ ఆయువుపట్టు మీద జరుపుతున్న దాడులకు ప్రతిగా తాము ఇజ్రాయిల్‌ అణు మౌలిక సదుపాయాల వ్యవస్థమీద దాడి చేసినట్లు రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించారు. హార్ముజ్‌ జలసంధి మీద అదుపు సాధించేందుకు నాలుగు అవకాశాలను అమెరికా పరిశీలిస్తోంది.

ఒకటి చమురు కేంద్రం ఖార్గ్‌ దీవి ఆక్రమణ, జలసంధిని అదుపు చేసే కేంద్రం, బంకర్లు ఉన్న లారక్‌ దీవిపై దాడి, జలసంధికి పశ్చిమ మార్గంగా ఉన్న రెండు దీవుల ఆక్రమణ, నాలుగవది ఇరాన్‌ నౌకల దిగ్బంధం. ఇందుకోసం ఐదువేల మంది మెరైన్‌, వెయ్యి మంది వైమానిక కమాండర్లను దించి ఇరాన్‌ దీవులను పట్టుకొనేందుకు అమెరికా పూనుకుంది.దానికి ప్రతిచర్యలకు ఇరాన్‌ పాల్పడు తోంది. భూతల దాడులు, ఇరాన్‌ ఆక్రమణ గురించి కూడా ఆలోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాలతో గురువారం నాడు మరోసారి ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్రెంట్‌ రకం 105 డాలర్లు దాటింది. ఇంథన మౌలిక సదుపాయాలపై ఐదు రోజుల పాటు దాడులు నిలిపివేస్తానని ట్రంప్‌ చేసిన ప్రకటన అదనపు బలగాలను రప్పించేందుకు వేసిన ఎత్తుగడ అన్నది తేలిపోయింది. తమ దీవుల మీద దాడిచేస్తే హర్ముజ్‌ జలసంధిలో మందుపాతరలు పెట్టి పేల్చివేస్తామని, రక్తపుటేరులు పారిస్తామని టెహరాన్‌ ప్రకటించింది.

అంతేకాదు, ప్రపంచ చమురురవాణాలో పదిశాతం నౌకలు ప్రయాణించే బాబ్‌ అల్‌ మండాబ్‌ జలసంధిని కూడా దిగ్బంధనం చేస్తామని అందుకు గాను ఎమెన్‌లో ఉన్న తమ అనుయాయులు సిద్ధంగా ఉన్నట్లు కూడా స్పష్టం చేసింది. అక్కడి నుంచే ఏడెన్‌ జలసంధి ప్రారంభమవుతుంది. అదే జరిగితే ఈజిప్టులోని సూయజ్‌ కాలువ బదులు ఆఫ్రికాలోని గుడ్‌హాప్‌ ఆగ్రం చుట్టూ నౌకలు తిరిగి రావాల్సి ఉంటుంది. మధ్యధరా సముద్రంతో ఎర్ర సముద్రాన్ని అనుసంధానిస్తూ తవ్విందే సూయజ్‌ కాలువ. ఐరోపా, ఇతర ఖండాల నుంచి వచ్చే నౌకలు ఎర్ర సముద్రం నుంచి ఏడెన్‌ గల్ఫ్‌ ద్వారా హిందూ మహా సముద్ర ప్రాంతమైన అరేబియా సముద్రంలో ప్రవేశిస్తాయి. గతంలో గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు చేసినపుడు ఎమెన్‌లోని హౌతీ సాయుధ దళాలు ఇజ్రాయిల్‌ తీరానికి వెళ్లేందుకు ఆ ప్రాంతానికి వచ్చిన కొన్ని నౌకల మీద దాడులు చేసి ముంచివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకంటే తీవ్ర స్థాయిలో చర్యలుండే అవకాశముంది.

అమెరికా-ఇజ్రాయిల్‌ను అదుపు చేయటంలో ఐరాస విఫలమైంది. భారత్‌ వంటి దేశాలు వత్తిడి తెచ్చేందుకు పూనుకోకపోవటంతో తమకు ఎదురులేదన్నట్లుగా ట్రంప్‌-నెతన్యాహు రెచ్చిపోతున్నారు. ఉన్మాదంతో వ్యవహరిస్తున్న తమ శత్రువును అదుపులో ఉంచేందుకు బాబ్‌ అల్‌ మండాబ్‌ జలసంధిని కూడా మూసివేయక తప్పదని ఇరాన్‌ ప్రకటించింది. ఈ జలసంధి ఇరుకుగా ఉంటుంది, వెడల్పు 29 కిలోమీటర్లు మాత్రమే. దాడులు చేయటం సులభం.ఈ జలసంధి ద్వారా జరిగే ముడి చమురు, ఉప ఉత్పత్తుల రవాణాలో అరవై శాతం ఐరోపా, అమెరికా దేశాలకు, మిగిలింది ఆసియాకు జరుగుతోంది.

అందువలన దీన్ని ఆటంకపరిస్తే సెగ అందరికీ తగులుతుంది. రాజధాని సనాతో సహా ఎమెన్‌లో కీలకమైన ప్రాంతాన్ని ఇరాన్‌ అనుకూల హౌతీ దళాలు అదుపు చేస్తున్నాయి. హర్ముజ్‌ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్‌ అన్ని హద్దులను దాటుతున్నదని గల్ఫ్‌ సహకార మండలి(జిసిసి)మండిపడింది. ఇన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వెనుక కచ్చితంగా అమెరికా వత్తిడి ఉందన్నది స్పష్టం. అయితే అన్యాయంగా అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్నదాడుల గురించి మౌనం దాల్చటం గర్హనీయం, అమెరికాకు లొంగిపోవటం తప్ప మరొకటి కాదు. తమ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు నెలకొల్పు కొనేందుకు అవకాశమివ్వటం ఆ దేశాలు చేసిన చారిత్రక తప్పిదం.

అక్కడి నుంచి తమ మీద దాడులు జరుపుతుంటే ఏదేశమైనా సహిస్తుందా? దాడులపాలని అమెరికా- ఇజ్రాయిల్‌ మీద వత్తిడి తేవాల్సిన జిసిసి ఇరాన్‌కు హెచ్చరికలు చేస్తే ఉపయోగం ఉండదు.ఈ కూటమి బలహీనతలను ఆధారంగా చేసుకొని అమెరికా తెగబడుతోంది. దాన్ని నమ్ముకొని ఇరాన్‌పై దాడుల్లో భాగస్వాములైతే అంతకన్నా తప్పిదం వేరే ఉండదు. తమకు అమెరికా శత్రువు తప్ప గల్ఫ్‌ దేశాలు కాదని కొద్ది రోజుల క్రితమే టెహరాన్‌ స్పష్టం చేసింది. అందువలన తమ పలుకుబడిని ఉపయోగించి ఇతర దేశాలను కూడా అమెరికా మీద వత్తిడి తెస్తేనే తమకూ, ప్రపంచానికి ప్రయోజనమని అవి గుర్తించాలి. ఇరాన్‌ హెచ్చరించినట్లుగా బాబ్‌ అల్‌ మండాబ్‌ జలసంధి సంక్షోభంలోకి వెళితే దానికి పూర్తి బాధ్యత అమెరికా- ఇజ్రాయిల్‌దే. వాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిస్తున్న దేశాలదేనని చెప్పక తప్పదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -