Friday, January 2, 2026
E-PAPER
Homeజాతీయంసర్‌తో గందరగోళం

సర్‌తో గందరగోళం

- Advertisement -

కేరళలో కొనసాగుతున్న ప్రక్రియ
23 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు
పాత డేటా దొరకక ఇబ్బందులు
అక్కడి ఓటర్లలో సందేహాలు.. ఆందోళనలు


తిరువనంతపురం : భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రస్తుతం కేరళలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను నిర్వహిస్తోంది. కేరళలో షెడ్యూల్‌ ప్రకారం 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సర్‌ నిర్వహణ అక్కడి ఓటర్లలో ఆందోళన కలిగిస్తున్నది. కేరళలో 2002 తర్వాత మొదటిసారిగా ఈసీ చేపడుతున్న సర్‌.. అక్కడి ఓటర్లలో అనేక సందేహాలు, గందరగోళాన్ని సృష్టిస్తున్నది. 23 ఏండ్ల క్రితం నమోదు చేసిన వివరాలు తిరిగి సమర్పించాల్సి రావడంతో.. చాలా మంది ఓటర్లకు ఇది ఇబ్బందులకు గురి చేస్తున్నది.

‘సర్‌’ అంటే ఏంటి?
సర్‌ అనేది ఓటర్ల జాబితాలను సందర్భోచితంగా, కచ్చితంగా, ఇంటింటి స్థాయిలో పున:పరిశీలించే విస్తృత కార్యక్రమం. సాధారణ వార్షిక సారాంశ సవరణల కంటే ఇది చాలా విస్తృతమైన ప్రక్రియ. బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికి వెళ్లి ఫారాలు ఇవ్వడం, వివరాలు సేకరించడం ఇందులో ప్రధాన భాగం. ఇందులో పాత, తప్పు, పునరావృత పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల చేర్పు, చిరునామా, పేరు మార్పులను సరిచేయటం వంటివి ఉంటాయి. కేరళలో 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఓటరు జాబితాను సిద్ధం చేస్తారు. ఈసారి ముఖ్యంగా 2002 సర్‌ సమయంలో నమోదు చేసిన అసెంబ్లీ నియోజకవర్గం (ఎల్‌ఏసీ), బూత్‌ నెంబర్‌, సీరియల్‌ నెంబర్‌.. ఇలాంటి పాత వివరాలు ఇవ్వాల్సి రావటంతో అవి దొరకక ఓటరు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన బీహార్‌లో ఈ ప్రక్రియ పెద్ద దుమారాన్నే రేపిన విషయం విదితమే.

2002 డేటా కనబడకపోవడమే పెద్ద సమస్య
ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో పాత ఎస్‌ఐఆర్‌ రికార్డులను పాత ఎపిక్‌ నెంబర్‌ ద్వారా పొందలేకపోవడం వల్ల చాలా మందికి ఇబ్బందులు పెరిగాయి. ”పాత ఎస్‌ఐఆర్‌ డేటా ఆన్‌లైన్‌లో దొరకడం లేదు. దొరికితే సమస్య ఉండేది కాదు” అని కుడప్పన కున్ను బీఎల్‌ఓ గిరీశ్‌ కుమార్‌ చెప్పారు. ప్రత్యేకించి భారత్‌కు వచ్చిన ఎన్నారైలు, యువ ఓటర్లు, వృద్ధులు.. చాలా మంది 2002లో ఎక్కడ ఓటు వేసారో కూడా గుర్తు లేకపోవటం ఆందోళనను కలిగిస్తున్నది.

పేర్ల లోపాలు.. తప్పులు మరో తలనొప్పి
2002 నాటికి ఓటరు కార్డు లేనివారు, అప్పట్లో పేర్లు తప్పుగా నమోదైనవారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ”2002లో నాకు ఓటరు కార్డు లేదు. ఇప్పుడు నా తండ్రి వివరాలు కావాలి. ఆయన బూత్‌ గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. పైగా ఆయన పేరు అప్పట్లో తప్పుగా నమోదైంది” అని కె.ఎస్‌ దుర్గా అనే ఓ వైద్యాధికారి వెల్లడించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బీఎల్‌ఓలు ప్రత్యేకంగా సర్‌ హెల్ప్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ”ఈ విషయంలో ఆందోళన అవసరం లేదు. మే వరకు సమ యం ఉన్నది. కానీ వీలైనంత త్వరగా డేటాను అప్‌డేట్‌ చేయించుకుంటే మంచిది” అని పనాన్‌గడ్‌ బీఎల్‌ఓ రేమ్య నందనన్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -