– వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటూ హెచ్చరిక
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఉనికి కోసం అసత్య ప్రచారం చేస్తూ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బుధవారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, బీబీపేట మండల అధ్యక్షుడు సుతారి రమేశ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, మాచారెడ్డి మండల అధ్యక్షుడు నౌసి లాల్ నాయక్ తదితరులు మాట్లాడారు.
అదేవిధంగా నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గతంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ నాయకుడు మహ్మద్ షబ్బీర్ అలీ పై చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, అవసరమైతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, అభివృద్ధి పేరుతో చేసిన హామీలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. డిగ్రీ కాలేజీ భూముల అంశంపై తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
ఎన్నికల సమయంలో ప్రస్తావించిన ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉన్న నేపథ్యంలో సీబీఐ లేదా ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని సూచించారు. మరోసారి తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం పాటించాలని ఈ సందర్భంగా ఆయనకు సూచిస్తున్నామన్నారు.



