Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌... ఆకర్ష్‌...

కాంగ్రెస్‌… ఆకర్ష్‌…

- Advertisement -

మున్సిపల్‌ ఎన్నికల వేళ సీఎం స్కెచ్‌
హస్తం గూటికి ఖమ్మం బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు
గతంలో వైఎస్‌, ఆ తర్వాత కేసీఆర్‌ రూట్‌లోనే రేవంత్‌రెడ్డి
పార్టీపరంగా ఎక్కువ సీట్లే లక్ష్యం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించినట్టుగా చెబుతున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు మున్సిపల్‌ ఎలక్షన్ల ముందుగా భారీ స్కెచ్‌ వేసినట్టు కనబడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం వైస్‌ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాదిరిగానే ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు తెరతీసినట్టు కనబడుతోంది. ఇందులో భాగంగా ఖమ్మం కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు కార్పొరేటర్లు బుధవారం సీఎం సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరిపోయారు. గులాబీ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కొత్తగూడెం పర్యటన చేపట్టిన రోజే…కార్పొరేటర్లు అధికార పార్టీ కండువా కప్పుకోవటం గమనార్హం.
మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 80 శాతం స్థానాలను కైవసం చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు. అయితే ఎన్నికల కమిషన్‌ దృష్టిలో అవి పార్టీ, గుర్తు రహిత ఎలక్షన్లు. అందువల్ల మాదే పై చేయి అంటే.. కాదు కాదు మాదే పైచేయంటూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకున్నాయి. కానీ త్వరలో జరగబోయే మున్సిపల్‌, ఆ తర్వాత చేపట్టబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పార్టీలు, వాటి గుర్తుల ఆధారంగానే జరుగుతాయి. అందువల్ల కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండింటికీ ఇవి కీలకమైనవి. ముఖ్యంగా అధికార పార్టీకి, సీఎం రేవంత్‌ రెడ్డికి ఇవి అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఈ క్రమంలోనే ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ను ప్రారంభించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి కాంగ్రెస్‌ నేతల వాదన కాస్త విడ్డూరంగా కనిపిస్తోంది. ‘గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పదవీ కాలం మూడేండ్లు, నాలుగేండ్లు ఉన్నప్పుడే బీఆర్‌ఎస్‌ వారిని తనవైపునకు లాక్కుంది. కానీ మేం అలాకాదు.. ఇప్పుడు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న కార్పొరేటర్ల పదవీ కాలం కొద్ది నెలల్లోనే ముగి యనుంది. ఈలోపే ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది.. అందువల్ల ఇది తప్పేం కాదు…’ అంటూ వారు తమ పార్టీ చర్యలను సమర్థించుకోవటం గమనార్హం.

తుమ్మల నేతృత్వంలో చేరికలు..
కాగా ఖమ్మం కార్పొరేషన్‌కు చెందిన ముగ్గురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. దనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి… సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు గతంలో గులాబీ పార్టీ నుంచి హస్తం గూటికి చేరిన కార్పొరేటర్లు సీహెచ్‌ లక్ష్మి, జి.చంద్రకళ, డి.సరస్వతి, అమృతమ్మ, ఎం.శ్రావణి… ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్లా రాగమయి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు తుమ్మల యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -